తొలి తరం తెలంగాణ వాదులలో అగ్రగామిగా ఉద్యమించిన ఆనాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి. ఆయన మరణంతో యావత్తు తెలంగాణ లో, ముఖ్యంగా తొలి దశ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. రాజకీయ నాయకుల కంటే ముందే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేసి రాజకీయాలకి అతీతంగా ఉద్యమాన్ని సాగించిన అతివాద తెలంగాణ వాదులలో శ్రీధర్ రెడ్డి అగ్ర గణ్యులు. వారితో పని చేసిన సమకాలీనులు వరంగల్లు కేంద్రంగా ఆర్ట్స్ కళాశాల విద్యార్థి నాయకుడు టి. సిద్దులు ప్రస్తుతము భద్రాచలంలో ఉంటున్నారు. విద్యార్థులకు ఉద్వేగ భరితమైన ఉపన్యాసాలు ఇచ్చి ఈ ప్రాంత విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన రాష్ట్ర నాయకులలో సిద్ధులు కూడా ఒకరు. కరీంనగర్, ఖమ్మం వరంగల్ జిల్లాల విద్యార్థులను సమన్వయం చేసిన నాయకులు సిద్దులు. ఆనాడు 11వ తరగతి చదువుతున్న నేను మహబూబాబాద్ తాలూకాలో ఉద్యమాన్ని ఉధృతం చేసి పరీక్షలను బహిష్కరించి అనేకమంది విద్యార్థులము జైలు పాలైనాము. శ్రీధర్ రెడ్డి తెలంగాణ అనేక జిల్లాలు తిరిగి విద్యార్థి లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి ఆకర్షించారు. ఆనాటి విద్యార్థి నాయకులు జైపాల్ రెడ్డి మల్లికార్జున్ లతో కలిసి పనిచేసిన నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు.
విద్యార్థి ఉద్యమాన్ని నడిపి..
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతున్న నాయకులతో శ్రీధర్ రెడ్డి అనేక సందర్భాల్లో విభేదించినారు. ఇలాంటి నాయకులు తమ సొంత రాజకీయ ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తారని తెలంగాణ ఉద్యమాన్ని మార్గమధ్యంలోనే నష్టాలకు గురిచేస్తారని అనేక సందర్భాల్లో హెచ్చరించారు. వారి హెచ్చరికలు నిజమైనట్లుగానే కొంతమంది నాయకులు ఉద్యమాన్ని నీరుగార్చడం జరిగింది. నారాయణ దాసు, పుల్లారెడ్డి, జలీల్ పాషా తో కలిసి పోటీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి. ఉస్మానియా క్యాంపస్, ఇందిరా ప్రియదర్శిని కాలేజీల కేంద్రంగా విద్యార్థి ఉద్యమాన్ని నడిపి ఎలాంటి పదవీ వ్యామోహాలకు, ప్రలోభాలకు లొంగని అంకితభావం గల నాయకుడు. విద్యార్థి నాయకులతో చర్చించడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆహ్వానించినప్పుడు తెలంగాణలో జరుగుతున్న నిర్బంధకాండ, పోలీసు కాల్పులు, విద్యార్థులపై కేసులు, లాఠీ దెబ్బలు, అరెస్టులు ఆపకుండా, చర్చలో పాల్గొనేది లేదని షరతులు విధించిన విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి.
ఎందరో సమకాలికులు
మర్రి చెన్నా రెడ్డి కాంగ్రెస్ ను వీడి తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన తర్వాత శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించే నాయకత్వ ఎంపిక చేయడంలో మల్లికార్జున్ తో పోటీపడ్డాడు. శ్రీధర్ రెడ్డి 1979లో జనతా పార్టీలో చేరినప్పటికీ రాష్ట్రం ఏర్పడే దాకా తెలంగాణ ఉద్యమం కొనసాగవలసిందేనని కోరుకున్నారు. బద్రి విశాల్ పిట్టి, కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్, ఆనందరావు తోట, కొండా లక్ష్మణ్ బాపూజీ, భూపతి కృష్ణమూర్తి ముచ్చర్ల సత్యనారాయణ, తక్కలపల్లి పురుషోత్తమరావు , మేచినేని కిషన్ రావు లాంటి తొలి తరం తెలంగాణ ఉద్యమ నాయకులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మా అందరికీ స్ఫూర్తినిస్తూ మలిదశ ఉద్యమంలోఅనేక జిల్లాలు పర్యటిస్తూ అనేక సభలలో మాతో పాల్గొన్నారు. ఇంకా ఆనాటి ఎస్ ఆర్ ఆర్ కళాశాల కరీంనగర్ ప్రిన్సిపాల్ వెలిశాల కొండలరావు ఈనాటి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమే. 1969 నాటి ఉద్యమంలో టీ. సిద్ధులు నాయకత్వంలో పనిచేసిన వారిలో నేనొకరిని. ఉద్యమాలకు కేంద్రాలుగా పనిచేసిన వర్సిటీలు ఇవాళ ప్రభుత్వ నిరాదరణకు గురవుతున్నాయి. శ్రీధర్ రెడ్డి తో పాటు వందల మంది తొలితరం ఉద్యమకారులు ఇంకా జీవించి ఉన్న సంగతి ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదు కావచ్చు. కేశవరావు జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, నిన్న శ్రీధర్ రెడ్డి మరణించడం తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు తీరని లోటు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలితరం, మలితరం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం అవమానించడం, నిర్లక్ష్యం చేయడం బాధాకరం. శ్రీధర్‌రెడ్డి వంటి ఉద్యమ నాయకుడి ఆత్మకు శాంతి కలగాలంటే.. వచ్చిన తెలంగాణను దోపిడీ పాలన నుంచి, అవకాశవాద రాజకీయాల నుంచి కాపాడుకోవాలె!
- కూరపాటి
వెంకట్ నారాయణ,
రిటైర్డ్ ప్రొఫెసర్