పాకిస్థాన్ ఉగ్రవాదులు ఎక్కడైనా అటాక్ చేశారని వింటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఆ పరిసరాల్లో మన వాళ్లు ఉన్నారేమో.. వాళ్ల పరిస్థితి ఏంటోనని గాబరా పడిపోతాం. అక్కడికి సమీపంలో ఉన్నా నేరుగా వెళ్లి టెర్రరిస్టులతో పోరాడే ధైర్యం చేయలేం. కానీ ఎనిమిదేళ్ల వయసులోనే ఈ చిన్నారి ధైర్యంగా టెర్రరిస్టును ఎదిరించి మాట్లాడింది. ఆర్మీ క్వార్టర్స్‌లో చొరబడి దాడి చేస్తున్న పాకిస్థాన్ జైషే మహ్మద్ ఉగ్రవాదికి ముఖాముఖీ మాట్లాడి.. తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో పాటు క్వార్టర్స్‌లో ఎన్నో ప్రాణాలను కాపాడింది. అప్పటికే ఆ ఉగ్రవాది చేసిన గ్రనేడ్ దాడిలో గాయపడినా చెక్కు చెదరని ధైర్యంతో నిలిచి గంటపైగా మాట్లాడి టెర్రరిస్టును దాడి ఆపేలా కన్విన్స్ చేసింది. అక్కడి నుంచి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఒప్పించింది. సేఫ్‌గా కొంత దూరం వెళ్లాక తెలివిగా.. ఆర్మీ జవాన్లకు సమాచారం ఇచ్చి, ముష్కరుల అంతం చూసింది. ఈ చిన్నారి చూపిన తెగువ, ధైర్యానికి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పుస్కారానికి ఎంపికైంది. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ నుంచి అవార్డును అందుకోవడంతో పాటు ఆయన ప్రశంసలు కూడా పొందింది.
?ఉగ్రవాదులు దాడిచేసే సమయానికి ఆర్మీ జవాన్ అయిన తండ్రి ఇంట్లో లేరు.
— PIB in Andhra Pradesh (@pibvijayawada) January 24, 2022
?అయినా ఆ అమ్మాయి వారికి ఎదురెళ్లి పోరాడింది. తన తల్లిని, తోటివారిని కాపాడింది
?తనే శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియ. నేడు ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందుకుంది pic.twitter.com/xNH7tbCfdx
తండ్రి ఇంట్లో లేడు.. అయినా ధైర్యంగా టెర్రిరిస్టుకు ఎదురెళ్లి
ఈ వీర బాలిక పేరు గులుగు హిమ ప్రియ. ఈ చిన్నారి తండ్రి గులుగు సత్యనారాయణ ఆర్మీలో హవల్దార్‌గా పని చేస్తున్నారు. వీరి స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం కాగా.. 2018 సమయంలో జమ్ములోని ఉధంపూర్‌లో పని చేస్తుండేవారు. ఆ ఏడాది ఫిబ్రవరి 8న తెల్లవారు జామున.. వాళ్లు ఉంటున్న సుంజువాన్ ఆర్మీ రెసిడెన్షియల్ క్వార్టర్స్‌పై జైషే మహ్మద్ టెర్రరిస్టులు అటాక్ చేశారు. అయితే ఆ సమయంలో తండ్రి సత్యనారాయణ ఇంట్లో లేడు.. ఉధంపూర్‌లో డ్యూటీకి వెళ్లారు. ఉగ్రవాదులు ఒక్కో ఇంటిపై అటాక్ చేస్తూ హిమ ప్రియ వాళ్ల ఇంటి వరకు వచ్చారు. అయితే అప్పటికే వాళ్లను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు తన తల్లి పద్మావతి పిల్లల్ని ఒక రూమ్‌లో పెట్టి.. డోర్‌కు ఫర్నీచర్ అంతా అడ్డుగా నిలిపింది. టెర్రరిస్టు లోపలికి వెళ్లడం కుదరకపోవడంతో హ్యాండ్ గ్రనేడ్ విసిరాడు. దీంతో పద్మావతికి తీవ్ర గాయాలై స్పృహతప్పి పడిపోయింది. చిన్నారి హిమ ప్రియకు కూడా భుజానికి గాయమైంది. అయినప్పటికీ ధైర్యంగా ముందడుగు వేసింది. తన తల్లిని, చెల్లెళ్లను కాపాడుకునేందుకు టెర్రరిస్టుకు ఎదురు నిలిచే సాహసం చేసింది. డోర్ తెరిచి ఆ ఉగ్రవాదితో మాట్లాడ సాగింది.. వాదించింది. ఎట్టకేలకు తన దారికి తెచ్చుకుంది. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అతడు ఒప్పుకునేలా చేసింది. తన చెల్లెళ్లతో పాటు తల్లిని వెంటబెట్టుకుని బయట పడింది. ఆ తర్వాత తనకెందుకులే అనుకోకుండా ఆర్మీ జవాన్లకు సమాచారం అందించి టెర్రరిస్టుల పనిబట్టేలా చేసింది. మొత్తానికి క్వార్టర్స్‌లో వీలైనన్ని ప్రాణాలను కాపాడేలా చేశాయి హిమ ప్రియ ధైర్య సాహసాలు. ఈ ధీరత్వాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆ చిన్నారిని 2022కు గానూ రాష్ట్రీయ బాల పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇవాళ ఆ పురస్కారాన్ని 12 ఏళ్ల హిమ ప్రియ వర్చువల్‌గా ప్రధాని నుంచి అందుకుంది. ఈ చిన్నారితో పాటు మొత్తం 29 మంది రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకున్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన బాలుడు తేలుకుంట విరాట్ చంద్ర కూడా ఉన్నాడు. ఏడేళ్ల వయసులో ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించినందుకు గానూ విరాట్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
Interacting with the youngsters who have been conferred the Rashtriya Bal Puraskar. https://t.co/rMEIt4dInz
— Narendra Modi (@narendramodi) January 24, 2022