శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగిన వైసీపీ నాయకుడు చంద్రయ్య హత్య కేసులో మిస్టరీ వీడింది. ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో జనవరి 25న చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ హత్యకు ప్లాన్ చేసిందెవరో తెలిసి ఖాకీలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో చంద్రయ్య భార్య ఈశ్వరమ్మతో పాటు మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో 15 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. భార్య వివాహేతర సంబంధమే భర్తకు శాపంగా మారి చివరకు అతని ప్రాణాల్ని బలితీసుకుందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో గురుగుబిల్లి చంద్రయ్య, అతని భార్య ఈశ్వరమ్మ(32) ఉంటున్నారు. ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళి కృష్ణ(35)అనే యువకుడుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ వివాహేతర సంబంధం గురించి ఈశ్వరమ్మ భర్త చంద్రయ్యకు తెలిసిపోయింది. ఈ విషయంలో భార్యను నిలదీసి.. పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. దీంతో.. ఈశ్వరమ్మకు, బాలమురళీ కృష్ణకు మధ్య మాటలు ఉండకూడదని భావించి చంద్రయ్య తన భార్య దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నాడు.
Also Read : పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్
ఈ విషయం ఎలా తెలిసిందో గానీ ఈశ్వరమ్మ నుంచి ఆ యువకుడికి సమాచారం అందింది. దీంతో.. ఆమె భర్తకు తెలియకుండా బాలమురళీకృష్ణ సీక్రెట్గా మరో ఫోన్ను ఈశ్వరమ్మకి ఇచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఈశ్వరమ్మ తన భర్తకు తెలియకుండా తన ప్రియుడితో మాట్లాడుతూ ఉండేది. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నా విషయం తన భర్తకు తెలిస్తే డేంజర్ అని ఈశ్వరమ్మ భావించింది.
మాటలైతే ఉంటున్నాయి గానీ శారీరకంగా కలవడానికి మాత్రం భర్త అడ్డుగా ఉన్నాడని ఆమె భావించింది. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయాలని డిసైడ్ అయింది. తన ప్లాన్ను ప్రియుడికి చెప్పింది. దీంతో.. ఈశ్వరమ్మను దక్కించుకోవడం కోసం బాలమురళీ కృష్ణ కూడా ఇదే సరైన నిర్ణయం అని భావించాడు. తనకు తమ్ముడు వరస అయిన ఆమదాలవలస మండలం శ్రీనివాసచార్యులపేటకి చెందిన అరవింద్‌ను బాలమురళీ కృష్ణ సంప్రదించాడు. అరవింద్కు గతంలో ఒక దాబా ఉండేది. అప్పట్లో దాబాలో పనిచేసే బూర్జ మండలం ఉప్పినివలసకి చెందిన గొల్లపల్లి వంశీ, సవలపురం గణేశ్, ప్రవీణ్, బొమ్మాళీ శ్రీ వర్ధన్, ఉమా మహేశ్, ఆమదాలవలస మండలం ఈశర్లపేటకి చెందిన కృష్ణ అనే యువకుల సాయంతో చంద్రయ్యను చంపేయాలని బాలమురళీ కృష్ణ స్కెచ్ వేశాడు.
ఈ గ్యాంగ్ ఆమదలవలసలోని స్థానిక డాబాలో బీర్లను సేవించి మూడు రోజులు రెక్కీ చేసి నాలుగవ రోజు బైక్ పై వస్తున్న చంద్రయ్యపై దారి కాసి బీరు సీసాలు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రాణం పోయిందని ఖాయం చేసుకున్నాక చంద్రయ్య మృతదేహాన్ని గోనె సంచిలో మూటచుట్టి ఆయనను చెరువు వరకు ఈడ్చుకెళ్లి చెరువులో పడేశారు. చంద్రయ్యను హత్య చేసిన తర్వాత అతని భార్య ఈశ్వరమ్మతో ఆమె ప్రియుడు ఫోన్లో మాట్లాడాడు. ‘‘నీ మొగుణ్ణి చంపేశాం.. ఇక మనకు ఏ అడ్డూ లేదు’’ అని ఆమెతో బాలమురళీ కృష్ణ చెప్పాడు.
చంద్రయ్య వైసీపీలో యాక్టివ్గా ఉండేవాడు. గతంలో ఇదే గ్రామంలో రాజకీయ కక్షలతో ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో.. చంద్రయ్యది మొదట రాజకీయ హత్యే అయి ఉంటుందని, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్లు చంపేసి ఉంటారని అంతా భావించారు. అయితే కొందరు గ్రామస్తులు హత్యకు ముందు ఆ మార్గంలో బైక్‌లతో కొందరు వ్యక్తులు చాలా సేపు ఉన్నారని , మందు తాగి మత్తుగా కనిపించారని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆ యువకులు ఎవరో ఆరా తీసి ఆ కోణంలో దర్యాప్తు చేయగా నిందితులు దొరికిపోయారు.