ఎంపీ టికెట్ ఇవ్వండి.. లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా: శ్రీకాంతాచారి తల్లి

భువనగిరి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ అమర వీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కోరింది. బీఆర్ఎస్ పార్టీని టికెట్ అడిగానని.. కేసీఆర్ తనకు టికెట్ ఇచ్చి గెలిపించాలని తెలిపింది. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాని చెప్పింది. అన్ని పార్టీలు తనపై  అభ్యర్థులను ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలని పేర్కొంది. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమన్నారు. 

ఈ సందర్బంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర శ్రీకాంతా చారి చిత్రపటానికి తల్లి శంకరమ్మ పూలమాల వేసి నివాళులార్పించింది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని.. తన బిడ్డతో పాటు వెయ్యి మంది బిడ్డలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కుటుంబాలకు ఇప్పటి వరకు చట్ట సభల్లో గాని, కనీసం నామినేటెడ్ పదవులు కూడా రాలేదని.. తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని విమర్శించింది.

ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు అమరవీరుల కుటుంబాలను గుర్తించాలని కోరింది. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన శ్రీకాంత చారి తల్లిగా ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని చెప్పింది శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.