రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. జీ స్టూడియోస్‌తో కలిసి దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జనవరి 10న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో కీలక పాత్రను పోషించిన శ్రీకాంత్ చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ ‘శంకర్ గారితో ఒక్కసారైనా పని చేయాలని ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టోరీ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకెందుకు చెబుతున్నారు అనిపించింది. సెకండాఫ్ విన్నాక కచ్చితంగా ఆ పాత్ర నేనే పోషించాలి అనిపించింది. నా గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.
ప్రోస్థటిక్ మేకప్ అలవాటు లేకపోవడంతో, ప్రారంభంలో కొంత కష్టం అనిపించింది. ఆ మేకప్‌కే నాలుగు గంటలు పట్టేది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. అలాగే సస్పెన్స్‌లు కూడా ఉన్నాయి. సినిమాకు ఎంతో కీలకమైన పాత్ర. మా నాన్నగారి ఫేస్ ఆధారంగా నా గెటప్‌ను ఫిక్స్ చేశారు. మేకప్‌తో ఇంటికి వెళ్తే మా అమ్మ కూడా చూసి షాక్ అయ్యారు. అప్పుడు నా గెటప్ సరిగ్గా సెట్ అయింది అనిపించింది.
రామ్ చరణ్‌తో పాటు ఎస్‌జే సూర్య, జయారం, సముద్రఖని పాత్రలతో నాకు సీన్స్ ఉంటాయి. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన చూసి అంతా షాక్ అవుతారు. అంత అద్భుతంగా నటించాడు. చాలా కొత్తగా కనిపిస్తాడు. శంకర్ గారు చాలా ఓపికగా ప్రతి పాత్రను నటించి చూపిస్తారు. ఈ మధ్య ఆయన తీసిన సినిమాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు కానీ ఇది అలా కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. సామాజిక సందేశం ఉంటుంది. దీనికి సీక్వెల్ లాంటివేమీ లేవు. దిల్ రాజు గారు ఖర్చుకి వెనకాడకుండా తీశారు. ఇక ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటు గట్టు’లో నటిస్తున్నా. అలాగే కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు సుష్మిత నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను’ అని చెప్పారు.