యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హరినామ స్మరణతో మార్మోగింది. శుక్రవారం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ, జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ‘అఖండ హరినామ సంకీర్తన’ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కోలాటాలు, నృత్యాలు, కీర్తనలు, భజనలు, యక్షగానాలు, బోనాలతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగాయి. నిత్య సంకీర్తలకు అవకాశం ఇవ్వాలిఅనంతరం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామీజీ మాట్లాడుతూ.. తిరుమలలో మాదిరిగానే యాదగిరిగుట్టపై అఖండ హరినామ సంకీర్తన నిత్యం నిర్వహించే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కళాకారులకు ఉచిత దర్శనం, రవాణా చార్జీలు, భోజన వసతి కల్పించాలని విన్నవించారు. ఇదే విషయంపై యాదగిరిగుట్ట ఆలయ ఏఈవో గజవెల్లి రఘు మాట్లాడుతూ.. పవిత్ర శ్రావణమాసంలో ఆలయంలో అఖండ హరినామ సంకీర్తన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్, ఉపాధ్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి కోడూరి భాస్కర్, జయహో జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి శేషు, జైభారత్ రాష్ట్ర అధ్యక్షుడు ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, రాష్ట్ర నాయకుడు ఖదిజ్ఞాసి వెంకట్, కళాకారుల సంఘం నల్గొండ జిల్లా కన్వీనర్ శంకర్ పాల్గొన్నారు.