శ్రీలంకను వణికిస్తున్న వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న 7 జిల్లాలు

శ్రీలంకను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ( జూన్​ 5,6)  కురుస్తున్న వర్షానికి దేశమంతా అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు నీటమునగగా.. బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దేశ రాజధాని కొలొంబోలో 7 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. దీంతో  ఒక్క రోజే 15మంది మృత్యువాత పడ్డారు. రతన్ పూర్ జిల్లాలో వరదల కారణంగా ఆరుగురు మృతి చెందగా..కొండచరియలు విరగడంతో మరో ముగ్గురు దుర్మరణం చెందారు. విపరీతమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడడంతో ఒక్కరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  వరద ఉధృతికి  మరో 15మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

300 మిల్లీమీటర్ల వర్షం నమోదు..

దేశ రాజధాని కొలొంబోతోపాటు రతన్ పూర్ ప్రాంతాల్లో సుమారు ( జూన్​ 5)  300 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ వరదల ధాటికి 4వేలకు పైగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 100కుపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా.. రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. పలు చోట్ల స్తంభాలు సైతం నేలమట్టం కావడంతో  విద్యుత్ సరఫరాను నిలిపివేసి... .వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా పడవలతో కూడిన శ్రీలంక సైన్యం బృందాన్ని పంపించి సహాయక చర్యలు చేపట్టింది. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూన్​ 7 నుంచి మూడు రోజుల పాటు  భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు.  వర్షాలు పడే ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.