గడ్డ కట్టిన కాశ్మీర్..5 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు

గడ్డ కట్టిన కాశ్మీర్..5 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
  • 5 దశాబ్దాల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు
  • మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్ 
  • 40 రోజుల ‘చిల్లై కలాన్’ సీజన్ ప్రారంభం 

శ్రీనగర్/జైపూర్: కాశ్మీర్ లోయ గడ్డ కట్టింది. వింటర్ లో అతి చల్లటి గాలులతో కూడిన అతి కఠినమైన ‘చిల్లై కలాన్’ సీజన్ ప్రారంభం కావడంతో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. దీంతో దాల్ లేక్ సహా జలాశయాల్లో నీటిపై మంచు పొరలు పొరలుగా పేరుకుపోతోంది. పైపులు, నల్లాల్లో సైతం నీళ్లు గడ్డకడుతున్నాయి. శనివారం శ్రీనగర్ లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 8.5 డిగ్రీ సెల్సియస్ లకు పడిపోయింది. శ్రీనగర్ లో గత ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ శుక్రవారం రాత్రి మైనస్ 6.2 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా, శనివారం మరో రెండు డిగ్రీలు పడిపోయినట్టు తెలిపింది. దీంతో కాశ్మీర్ వ్యాలీలో శనివారం నుంచి చిల్లై కలాన్ సీజన్ ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

కాశ్మీర్ లోయ అంతటా ఫ్రీజింగ్ పాయింట్ కంటే అనేక డిగ్రీలు తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయినట్టు పేర్కొంది. శ్రీనగర్ లో చివరిసారిగా 1974లో మైనస్ 10.3 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయిందని, ఆ తర్వాత తాజాగా అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయని వివరించింది. ఇక దక్షిణ కాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రకు బేస్ క్యాంపుగా ఉన్న పెహల్గామ్ లో కూడా శనివారం మైనస్ 8.6 డిగ్రీలు, గుల్ మార్గ్ స్కై రిసార్ట్ వద్ద మైనస్ 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాశ్మీర్ లోయలోని కోనిబల్ గ్రామంలో అత్యల్పంగా మైనస్ 10.5 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయింది. అలాగే కాజీగుండ్ లో మైనస్ 8.2, కుప్వారాలో మైనస్ 7.2, కోకర్ నాగ్ లో మైనస్ 5.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కాశ్మీర్ వ్యాలీలో ఈ నెల 26 వరకూ పొడి వాతావరణం ఉంటుందని, ఎత్తయిన ప్రాంతాల్లో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఇయర్ సమయానికల్లా స్నో ఫాల్ భారీగా పెరగవచ్చని పేర్కొంది.

40 రోజులు ఇంతే.. 

కాశ్మీర్​లో ఏటా వింటర్​లో అత్యంత చలితో కూడిన 40 రోజుల పీరియడ్ ను చిల్లై కలాన్ (మేజర్ కోల్డ్) అని పిలుస్తుంటారు. చిల్లై కలాన్ రోజుల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయి, చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. అలాగే మంచు కూడా విపరీతంగా కురుస్తుంది. ఈసారి శనివారం ప్రారంభమైన ఈ సీజన్ వచ్చే ఏడాది జనవరి 31 వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత 20 రోజులపాటు ‘చిల్లై ఖుర్ద్ (స్మాల్ కోల్డ్)’, అనంతరం 10 రోజులపాటు ‘చిల్లై బచ్చా (బేబీ కోల్డ్)’ సీజన్ లు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.  

రాజస్థాన్ లో 4 డిగ్రీలకు.. 

రాజస్థాన్​లోనూ అనేక ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. శనివారం ఫతేపూర్ లో 4.3, శికర్​లో 5, పిలానీలో 5.4, గంగానగర్ లో 6.1 డిగ్రీ సెల్సియస్​ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉందని, 23, 24వ తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, 26, 27 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల టెంపరేచర్లు మరింత పడిపోవచ్చని, చలిగాలుల తీవ్రత పెరగవచ్చని పేర్కొంది.