ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

మోడీ పాలనలో సామాన్యుడిపై భారం 

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ పాలన.. కేడీ పాలనను తలపిస్తోందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​ అన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం ధర్నా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్​, కాంగ్రెస్​ నగర అధ్యక్షుడు మహ్మద్​ జావీద్​ మాట్లాడుతూ... కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యడి నడ్డి విరుస్తున్నాయన్నారు. దేశం మరో శ్రీలంకలా కాకముందే ప్రజలు కలిసికట్టుగా వ్యవహరించి మోడీ, కేసీఆర్​లను గద్దెదింపాల్సిన అవసరముందన్నారు. ధర్నాలో సీనియర్​ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్​ మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, వీరభద్రం, బొందయ్య, శేఖర్, నారాయణరావు పాల్గొన్నారు.  

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 

మధిర, వెలుగు:  ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు క్రాస్ రోడ్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. ఏపీ రాష్ర్టం ఎన్టీఆర్​జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామానికి చెందిన సంగెపు పృథ్వి(29) సోమవారం రాత్రి బైక్ పై వస్తూ మాటూరు క్రాస్​ రోడ్డు వద్ద బస్​షెల్టర్​ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలవడంతో స్పాట్​లోనే చనిపోయాడు. మధిర రూరల్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పృథ్వి డెడ్​బాడీని మధిర హాస్పిటల్​కు తరలించారు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బైక్​ పైనుంచి పడి ఒకరు.... 

వైరా, వెలుగు:  బైక్ నడుపుతూ కింద పడి ఒకరు చనిపోయాడు. వైరా మున్సిపాలిటీలోని రేచర్ల బజారుకు చెందిన మడిపల్లి చిట్టిబాబు(60) బైక్ పై వెళ్తూ ఇందిరమ్మ కాలనీ వద్ద కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో చిట్టిబాబు స్పాట్​లోనే చనిపోయాడు. చిట్టిబాబు డెడ్​బాడీకి వైరా వర్తక సంఘం అధ్యక్షుడు, 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వనమా విశ్వేశ్వర రావు నివాళులర్పించారు. అంత్యక్రియల ఖర్చులకు వైరా కిరాణా జాగీరు వర్తక  సంఘం రూ10,000 అందజేసింది.

అడవిదున్న దాడిలో పలువురికి గాయాలు 

పాల్వంచ,వెలుగు: అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఓ అడవిదున్న పిల్ల పాల్వంచవాసులను బెంబేలెత్తించింది. సోమవారం అర్ధరాత్రి  పట్టణంలోని బొల్లోరిగూడెం శిశు మందిర్ స్కూల్​ఏరియాలోకి ప్రవేశించిన అడవి దున్నపిల్ల  ఇండ్లల్లోకి దూరి పలువురిని గాయపరిచింది. స్థానిక సమ్మెట ఉపేందర్ అనే ఆటో ట్రాలీ డ్రైవర్ భార్య ఉమపై దాడి చేసింది. గాయాలపాలైన ఆమె కేకలు వేస్తుండగా చుట్టుపక్కల వారు వచ్చారు. వారిపై కూడా దాడిచేసింది . ఈ దాడిలో వల్లపు మురళి, భార్య అనిత గాయపడ్డారు. జనాల అరుపులతో అడవిదున్న పిల్ల ఓ ఇంటి గేటును ధ్వంసం చేసి లోపలకు పరుగెత్తింది. సమీపంలో ఓ కారు డోరును ఛిద్రం చేసింది. ప్రజలు కర్రలు తీసుకొని వెంట పడడంతో సమీపంలోని చెట్ల పొదల్లోకి పారిపోయింది. అర్ధరాత్రి అటవీశాఖ అధికారులు, 100 కు డయల్ చేసినా ఉపయోగం లేకుండా పోయిందని స్థానికులు వాపోయారు.  

ఉద్యోగులు నిజాయతీగా పనిచేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారు నిజాయతీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వి.పి. గౌతమ్ హితవు పలికారు. జిల్లాలో కారుణ్య నియామకం కింద వారి వారసులు, కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం కల్పిస్తూ మంగళవారం ఆరుగురికి కలెక్టర్ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, డీఆర్వో శిరీష, కలెక్టరేట్‌‌‌‌ ఏవో మదన్ గోపాల్ పాల్గొన్నారు.

పాము కాటుతో మహిళ మృతి

వేంసూరు, వెలుగు: పాము కాటుతో ఓ మహిళ చనిపోయింది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన దోసపాటి విజయలక్ష్మి(49) ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి పాము మంచం మీద పడి ఆమెను కాటేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి భర్త దోసపాటి సత్యనారాయణ ఆరునెలల క్రితం కరెంట్​షాక్​ తో మృతిచెందగా ఇప్పుడు అతని భార్య పాము కాటుతో చనిపోవడం ఆ ఇంట్లో విషాదం నెలకొంది. 

పులిగుట్టలో సుదర్శన యాగం పూర్తి

వైరా ,వెలుగు: వైరా మండలం గొల్లపూడి  రెవెన్యూ పరిధిలోని పులిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లో మూడో రోజులుగా చేస్తున్న సుదర్శన యాగం ముగిసింది. మంగళవారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్​ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాఅన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మార్క్​ఫెడ్​వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,  మున్సిపల్ చైర్మన్ జైపాల్,  వైరా ఏఎంసీ చైర్మన్​ రత్నం, ఎంపీపీ పావని, జడ్పీటీసీ కనకదుర్గ , టీఆర్ఎస్​ నాయకులు పసుపులేటి మోహన్​రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కోయగూడెంలో శ్రీనిధి డబ్బుల గోల్​మాల్

సీసీ కాజేసిండని డ్వాక్రా మహిళల ఆరోపణ

టేకులపల్లి,వెలుగు: తమ సంఘాలకు చెందిన శ్రీనిధి డబ్బులను సీసీ కాజేసిండని టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతీ డ్వాక్రా సంఘాల మహిళలు పేర్కొన్నారు. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో డ్వాక్రా మహిళలు మీడియాతో మాట్లాడారు. వారి వివరాల ప్రకారం.. కోయగూడెం పంచాయతీ చుట్టపక్కల గ్రామాల్లో 68 డ్వాక్రా గ్రూపులున్నాయి. 2016 నుంచి 2022 వరకు టేకులపల్లి సెర్ప్ కార్యాలయంలో సీసీగా చిరంజీవి పనిచేశాడు. కోయగూడెంలో డ్వాక్రా లోన్లు గోల్​మాల్​ చేసిన ఆరోపణలపై నాలుగు నెలల కింద సస్పెండ్​అయ్యాడు. అయితే శ్రీనిధి లోన్లు తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించాలంటూ ఇటీవల ఆఫీసర్లు వచ్చి మహిళలను అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది. తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని పలు సంఘాల మహిళలు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో ఏపీజీవీ బ్యాంకు ఆఫీసర్ల హస్తం ఉందని మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

డెంగీతో అలర్ట్​గా ఉండాలి 

ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో సోమవారం రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అలర్ట్​ అయింది.  మంగళవారం గోకినేపల్లిలో డెంగీ సోకిన వారి ఇండ్లను డీపీవో హరిప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు పరిశీలించారు. డెంగీ జ్వరాలపై జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ క్రాంతి, పంచాయతీ కార్యదర్శికిసూచించారు.

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ 

పెనుబల్లి, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉంటుందని  స్టేట్​ఎస్సీ కార్పోరేషన్​ మాజీ చైర్మన్​ పిడమర్తి రవి అన్నారు.  పెనుబల్లి మండలం రంగారావు బంజర్​గ్రామంలో టీఆర్ఎస్​ జిల్లా నాయకులు సోమరాజు సీతారామారావు ఇంట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ బైఎలక్షన్​ ఏదైనా టీఆర్ఎస్​దే విజయమన్నారు. మునుగోడు కాంగ్రెస్ కు ​సిట్టింగ్​ సీటు అయినా మూడో స్థానానికే పరిమితం అవుతుందన్నారు. లీడర్లు ప్రేమానందం, రాంబాబు, వెంకటేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు. 

అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..? 

ఖమ్మం రూరల్, ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోలీసుల సాక్షిగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సమాధి చేస్తున్నారని, పోలీస్​వ్యవస్థ నిర్వీర్యం అయిందని  బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. వరంగల్​ క్రాస్​ రోడ్​లో మంగళవారం బీజేపీ శ్రేణులతో కలిసి శ్రీధర్​రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, అంబేడ్కర్​సెంటర్​లో గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్​కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్​ కేసులో కీలక పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా చెబుతుంటే, తెరాస నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. అనంతరం ఏదులాపురంలోని శ్రీధర్​రెడ్డి క్యాంపు ఆఫీస్​లో బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందరరావు, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు రుద్రప్రదీప్​, శ్యాంరాథోడ్​, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విజయరాజు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ పాల్గొన్నారు.

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని అంబేద్కర్​ సెంటర్​లో బీజేపీ ఆందోళనను అడ్డుకొని బీజేపీ లీడర్లను పోలీసులు అరెస్ట్  చేశారు. బండి సంజయ్​అరెస్ట్​కు నిరసనగా ఆందోళన చేస్తారని భావించి పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్​రావు, ప్రధాన కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సుదర్శన్​, పీసీ కేశవ్​, సుబ్బారావు, జయరాజు తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. 

యువతి ఆత్మహత్య

సుజాతనగర్, వెలుగు: ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని స్టేషన్ బేతంపూడి గ్రామానికి చెందిన ఎట్టి జ్యోతిప్రియ(20) కు ఉన్నత విద్య చదవాలనే కోరిక. కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో చదివే ప్రాణంగా భావించిన జ్యోతిప్రియ మనస్తాపానికి గురైంది. సోమవారం అందరూ పొలాలకు వెళ్లడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం చనిపోయింది. మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు సుజాతనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతరపంటలతో అధికాదాయానికి కృషి 

దమ్మపేట వెలుగు: ముదురు పామాయిల్, కొబ్బరి తోటల్లో అదనపు ఆదాయం పొందేందుకు అంతర పంటలు సాగు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆన్నారు. గండుగలపల్లి, మందలపల్లి, అల్లిపల్లి గ్రామాల్లోని పామాయిల్, కొబ్బరి తోటలను ఉద్యానవన శాఖాధికారులు, కేరళ శాస్త్రవేత్తలతో కలిసి మంగళవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతు పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఆయిల్ హెచ్చు తగ్గులు వచ్చినా నష్టపోకుండా అంతరపంటల ద్వారా అధికాదాయం పొందేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంతరపంటగా జాజికాయి సాగుకు అనుకూలతను పరిశీలించేందుకు మంగళవారం ఇండియన్​ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పైసీస్​రీసెర్స్, కాలికట్ సైంటిస్టులు వచ్చారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారులు మాధవి, జినుగు మరియన్న, పామాయిల్​సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రాంచంద్రప్రసాద్​పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గణపతి ఉత్సవాల్లో మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్​అనుదీప్​ సూచించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జనాలు మట్టి వినాయక విగ్రహాలనే పూజలకు వినియోగించాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, మున్సిపాలిటీలు, మేజర్​ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల ద్వారా ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వినాయక మండపాల వద్ద ఫైర్​సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్​, డీఆర్వో అశోక్​ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, ఎక్సైజ్​సూపరింటెండెంట్​జానయ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆఫీసర్ల తీరుపై కలెక్టర్​ఆగ్రహం 

అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్ అనుదీప్ ఆఫీసర్లపై మండిపడ్డారు. డ్యూటీల్లో నిర్లక్షంగా ఉన్న ఆఫీసర్లకు షోకాజ్​నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్లో వివిధ శాఖల ఆఫీసర్లతో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఇల్లందు, బస్టాండు నిర్మాణ పనుల ఫొటోలను పరిశీలించిన కలెక్టర్ పనుల జాప్యంపై ఆర్టీసీ డీఈకి, పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై కొత్తగూడెం, భద్రాచలం పంచాయతీరాజ్ డీఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీపీవో రమాకాంత్, పీఆర్​ఈఈలు సుధాకర్, మంగ్యా, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజీ, డీఎంహెచ్​వో దయానందస్వామి, నవభారత్, కేటీపీఎస్, ఐటీసీ  పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు.    

కృష్ణయ్య కుటుంబానికి ఎంపీ నామా పరామర్శ

ఖమ్మం రూరల్​, వెలుగు : టీఆర్ఎస్​ లీడర్, ఆంధ్రబ్యాంక్​ కర్షక సేవా సొసైటీ డైరెక్టర్​తమ్మినేని కృష్ణయ్య ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, టీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్.. కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ  కృష్ణయ్య హత్యని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలను ఎవరూ సమర్థించరని అన్నారు. పోలీసు అధికారులు నిష్పాక్షింగా దర్యాప్తు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ ఉమ, ఆంధ్రాబ్యాంక్​ సొసైటీ చైర్మన్​ నాగచంద్రారెడ్డి, జడ్పీటీసీ ప్రసాద్​, డీసీసీబీ డైరెక్టర్​ శేఖర్ పాల్గొన్నారు.