వరదలపై బీఆర్ఎస్​ది బురద రాజకీయం :విప్ ఆది శ్రీనివాస్

వరదలపై బీఆర్ఎస్​ది బురద రాజకీయం :విప్ ఆది శ్రీనివాస్
  • కేసీఆర్ ఎక్కడున్నడో ఎవరికీ తెల్వదు: విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: వరదలపై బీఆర్‌‌‌‌ఎస్ బురద రాజకీయం చేస్తున్నదని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయాలే కనిపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. గురువారం సీఎల్పీలో మీడియాతో   ఆయన మాట్లాడారు. ‘‘కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ ట్విట్టర్​లో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నడు.

ప్రజలపై కేటీఆర్​కు ప్రేమ ఉంటే 18 గంటల్లో అమెరికా నుంచి రావొచ్చు. ఇక, కేసీఆర్ ఎక్కడున్నడు.. ఏం చేస్తున్నడనే విషయం ఎవరికీ తెల్వదు. ఫాంహౌస్​లో ఉన్నడా.. నందినగర్​లోని ఇంట్లో ఉన్నడ? మృతుల కుటుంబాలకు కనీసం సంతాపం కూడా ప్రకటించలేనంత బిజీగా కేసీఆర్ ఉన్నడు. హరీశ్​ రావును మాత్రం జనంపై దాడికి పంపించిండు’’అని అన్నారు.

గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు క్లౌడ్ బరస్ట్ అని.. విదేశీ కుట్ర అని అబద్ధాలతో కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెండ్రోజుల పాటు వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఓదార్చి, నష్టపరిహారం ఇచ్చారన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. ప్రయోజనం లేదన్నారు.