చౌటుప్పల్ వెలుగు: 2014లో తెలంగాణలో సరైన విద్యుత్ సరఫరా లేక పరిశ్రమలు మూతపడ్డాయని, దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్ల పరిశ్రమలకు పునరుజ్జీవం వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల పరిధిలోని వివిధ పరిశ్రమల్లో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014కు ముందు ఫ్లోరైడ్ నీళ్లను తాగి ఫ్లోరోసిస్ బారిన పడి కాళ్లు, చేతులు వంకర్లు పోయి అనేక కష్టాలు పడ్డామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆ సమస్యలన్నీ తీరిపోయాయన్నారు. బీజేపీకి ఓటేస్తే మళ్లీ ఆ కష్టాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉందన్నారు. తర్వాత లింగోజిగూడెంలో గుర్రపుబండిపై తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వెంట టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, టీఆర్ఎస్కేవీ ఆటో విభాగం రాష్ట్ర నాయకుడు మారయ్య, చౌటుప్పల్ మండల ప్రెసిడెంట్ యాట కృష్ణ ఉన్నారు.
వారికివే చివరి ఎన్నికలు : మంత్రి తలసాని
చండూరు( నాంపల్లి): రాజగోపాల్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు అడ్డుకుంటున్నారని, గెలిపిస్తే తమ ఊరికి రాలేదని, పట్టించుకోలేదని నిలదీస్తున్నారని, అయినా సిగ్గు లేకుండా తిరుగుతున్నాడని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం నాంపల్లి మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ ఉప ఎన్నికే కోమటిరెడ్డి సోదరులకు చివరిదని, తర్వాత వారు రాజకీయంగా కనుమరుగవుతారన్నారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.