మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: దసరా ఉత్సవ కమిటీ సూచనల మేరకు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్ లో దసరా ఉత్సవ కమిటీ కార్యవర్గంతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఐలాండ్ లో దసరా కట్టను నిర్మించడంతో పాటు శాశ్వతంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. దసరా రోజు ఆర్య సమాజ్ భవన్ నుంచి ఊరేగింపు ప్రారంభమై క్లాక్ టవర్, అశోక్ టాకీస్ మీదుగా ట్యాంక్ బండ్ ఐలాండ్ కు చేరుకుంటుందన్నారు.
అక్కడ స్వర లహరి కల్చర్ అకాడమీ, దీప్తి శాస్ర్తీయ నృత్య కళాశాలతో పాటు వివిధ సంస్ధల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వి.మురళీధర్ రావు, ప్రధాన కార్యదర్శి ముత్యాల ప్రకాశ్, లైబ్రరీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింలు పాల్గొన్నారు.