సత్తుపల్లి/కుసుమంచి/జూలూరుపాడు/ అన్నపురెడ్డిపల్లి /ఎర్రుపాలెం / పాల్వంచ, వెలుగు : మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్థానిక ద్వారకపురి కాలనీలో నిరిస్తున్న ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీనివాసుని కల్యాణం వైభవంగా జరిగింది. శనివారం ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు.
కుసుమంచి మండలం జీళ్ల చెరువు వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీనివాసుని కల్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు హాజరయ్యారు. చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో 108 జంటలతో కలిసి ప్రసాద్ రెడ్డి దంపతులు పూజలు చేశారు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ అలయంలో శ్రీనివాసుని కల్యాణం నిర్వహించారు.
జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామం పాలగుట్ట శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గరుడ వాహనంపై స్వామివారి గిరిప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. పాత పాల్వంచలోని అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని తిరు కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, విమల దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.