దర్శకుడిగా శ్రీనువైట్ల కెరీర్ ప్రారంభించి నేటితో పాతికేళ్లు పూర్తయింది. ఆయన దర్శకుడిగా పరిచయమైన ‘నీకోసం’ చిత్రం 25 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. ఇన్నేళ్ల తన సినీ జర్నీగురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘దర్శకుడిగా ఈ ప్రయాణం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని అద్భుతాలెన్నో నా కెరీర్‌లో జరిగాయి. ఇదో బ్యూటిఫుల్ జర్నీ. నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నటీనటులు, నిర్మాతలకు ఈ సందర్భంగా థ్యాంక్స్.
ఇక ‘నీ కోసం’ విషయానికొస్తే.. నా తొలి సినిమా ఆగిపోవడంతో డిసప్పాయింట్ అయిన నన్ను ఒక ఫ్రెండ్‌గా రవితేజ ఎంకరేజ్ చేశారు. అలా ‘నీ కోసం’ సినిమా స్టార్ట్ చేశాం. కొన్ని కారణాలతో అది కూగా ఆగిపోగా, రవితేజ ప్రోత్సాహంతో పూర్తి చేశా. ఫస్ట్ కాపీ చూసిన నాగార్జున గారు డైరెక్షన్ ఆఫర్ చేయడం, రామోజీ రావు గారికి సినిమా నచ్చి రిలీజ్ చేయడం, సినిమాకు ఏడు నంది అవార్డ్స్ రావడం లాంటివన్నీ నాకెంతో మెమరబుల్ మూమెంట్స్. అప్పుడే 25 ఏళ్ళు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నా.అనుభవంతో పాటు నాలో పాషన్ ఇంకా పెరుగుతోంది. ఇంకా మంచి సినిమాలు తీయాలనే కోరిక బలంగా వుంది. అందుకోసం ఎప్పటికప్పుడు టెక్నికల్‌గా అప్‌డేట్ అవుతూనే ఉంటా.
ఈ జర్నీలో.. ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు, ఢీ నా ఫేవరేట్స్. వీటిలో ‘వెంకీ’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక ఓ ఫ్రెష్ ఐడియాతో నా మార్క్ ఎంటర్‌టైన్మెంట్ జోడించి నెక్స్ట్ మూవీ చేయబోతున్నా. త్వరలోనే అనౌన్స్‌మెంట్ ఉంటుంది’ అని చెప్పారు.