
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 2025, మార్చి 3న హోరాహోరీగా జరిగిన కౌంటింగ్లో యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి శ్రీపాల్ రెడ్డి అధిక్యం కనబర్చారు. అయితే.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టారు.
రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో విజయానికి కావాల్సిన ఓట్లు రావడంతో శ్రీపాల్ రెడ్డి గెలుపు ఖాయమైంది. శ్రీపాల్ రెడ్డి విజయాన్ని ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ సారి రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక బీజేపీ మద్దతు తెలిపిన సరోత్తమ్‌రెడ్డి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు.
యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమిని అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమని అన్నారు. గెలిచిన అభ్యర్థి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచించారు. ఓడిపోయినందుకు బాధపడటం లేదని.. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసని వ్యాఖ్యానించారు.