
పన్నెండు నెలలు కౌసల్యాదేవి గర్భంలో ఉండి చైత్రమాసం శుక్లపక్ష నవమినాడు మధ్యాహ్నం వేళ ఈ లోకానికి వచ్చారు శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణం కూడా అదే రోజున సీతమ్మతో జరిగింది. మానవ అవతారంలో వచ్చి.. మనిషి కీర్తి ప్రతిష్టలు దశదిశలా చాటినవాళ్లు సీతారాములు!
మనిషి ఎట్లాంటి గుణసంపదతో జీవించాలో ఎన్నో ఏళ్ల కిందే ఆచరణాత్మకంగా చేసి చూపించినవాళ్లు సీతారాములు. అందుకే చైత్రమాసంశుద్ద నవమి ...శ్రీరామనవమి అయింది. ఆ రోజున ( 2025 ఏప్రిల్ 6న)ప్రతి ఊరిలో వాళ్ల పెళ్లి జరిపించడం తరతరాల ఆచారమైంది.
ఉగాది తర్వాత ఎనిమిది రోజులకు వచ్చే తిథి శ్రీరామ నవమి. అప్పటికే ప్రకృతి మల్లెపూల సువాసనలతో, కమ్మని మామిడి పండ్ల రుచులతో నిండిపోతది. అందరికీ ఇష్టమైన, ఆహ్లాదకరమైన... ఆ వాతావరణంలో ప్రతి ఊళ్లో సీతారాముల కల్యాణం కన్నులపండుగగా జరుగుతుంది.
ఆయన ఎన్నడూ దుఃఖించలేదు
విష్ణుమూర్తి దశావతారాల్లో రామావతారం విశిష్టమైంది. దేవుడు ప్రతి అవతారంలో తన లీలలు (సూపర్ పవర్స్) చూపించినారు. లక్ష్మీదేవి కూడా అంతే! సీతారాములు మాత్రమే మనుషుల్లా పుట్టి.. మనుషుల్లాగే పెళ్లి, సంసారం వంటి అన్ని కర్మలు ఆచరించినారు. మానవుడు ఎంత ఉన్నతంగా జీవించవచ్చో ఆచరణాత్మకంగా చూపించినారు.. రాముడు ఎన్నడూ దుఃఖించలేదు. దుఃఖించినట్టు కూడా కనబడడు అంతే! ఎందుకు ఆయన అంత సంతోషంగా ఉన్నాడు? ఎప్పుడైనా ధర్మాన్ని విడిచిపెడితే.. ఆ రోజు ఆయన రోదించాలి.. కానీ.. ఆయన చివరి శ్వాస వరకు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. జీవిత ప్రయాణంలో ఎప్పుడు ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ ధర్మాన్ని ఆచరించినారు. ధర్మంగా నడిచినన్ని నాళు తనకు అపజయం లేదని విశ్వసించారు.
రెండు కాండలు ఉండేవి కాదు
రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఉంటే.. రామాయణంలో సుందర కాండ, యుద్ధ కాండలు ఉండేవి కాదు. కేవలం తన భార్య సీతని తిరిగి పొందడమే ఆయన ప్రయోజనం అయితే.. సుగ్రీవునితో కాకుండా వాలితో స్నేహం చేసేవాడు. వాలి చిటికేస్తే... రావణాసురుడు సీతమ్మని తీసుకొచ్చి రామునికి అప్పగిస్తాడే. . వాలి అంటే రావణుడికి అంత భయం! అధర్మమార్గంలో నడుస్తున్న వాలితో సంధి చేసుకుని.. అధర్మంగా తన భార్యను పొందడం కన్నా.. ధర్మంతో వాలి తమ్ముడు సుగ్రీవునితో స్నేహం చేసి.. అతనికి ఉపకారం చేసి వాలిని సంహరించి... సుందరకాండ, యుద్దకాండ దాటిన తర్వాత... రావణ సంహారం చేసి... సీతమ్మను పొంది... ధర్మంగా ముందుకు నడిచారు..శ్రీరామచంద్రుడు. ధర్మాన్ని అనుసరించినవాడు.. తిరుగులేని విజయం పొందుతాడు. కాలంతో సంబంధం లేకుండా.. వాళ్ల జీవిత కథ చరిత్రలో నిలిచిపోతుంది. ధర్మాన్ని లోకానికి చాటి చెప్పిన కథే రామాయణ కథ.
పూజలు చేస్తే చాలదు
"మాకు గుళ్లు కట్టాలి. భూగోళం ఉన్నంతకాలం ఈ మనుషులు మాకు పూజలు చెయ్యాలి అని చెప్పి పోయినరా సీతారాములు? ఇది చెప్పడానికేనా వాళ్లు ఈ లోకానికి వచ్చింది? 'మనిషి ఇలా ఉండాలి.. ఇలా ప్రవర్తించాలి. ఇలా చెయ్యాలి ' అని వాళ్లు ప్రాక్టికల్‌గా ప్రబోధించినారు.
►ALSO READ | శ్రీరామనవమి: ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అద్భుతం ..
మనిషి పవర్ ను చూపించినారు. మనిషి అంటే ఏంటి? మానవత్వపు విలువ ఏంటి? మనిషిలో ఉండాల్సిన గుణాలు ఏంటి? భర్త దగ్గర ఎలా ఉండాలి? భార్య దగ్గర ఎలా ఉండాలి? తమ్ముడి దగ్గరి ఎలా ఉండాలి? నాన్న దగ్గర ఎలా ఉండాలి? అమ్మ దగ్గర ఎలా ఉండాలి? అని చెప్పినారు
రాజును బట్టే ప్రజలు
'రామరాజ్యం' గురించి పెద్ద మాటలు చెప్తుంటారు ఇప్పటి పెద్దమనుషులు. రామరాజ్యం అంటే తెలుసా?.. దేశంలో లేదా రాష్ట్రంలో ప్రతి మనిషి సంతోషంగా జీవిస్తూ.. సుభిక్షంగా ఉండటమే రామరాజ్యానికి నిర్వచనం. మరి ఇప్పుడు రామరాజ్యం రావాలంటే మళ్లీ రాముడు పుట్టి ఏలాల్నా? అవసరం లేదు. ఇప్పుడున్న పాలకులు రాముని గుణగణాలు తెలుసుకుని.. ఆచరణలో పెడితే చాలు!
రాజు ఎట్ల ఉంటే ప్రజలు: కూడా అట్లానే ఉంటారు, పాలకుడు దుర్మార్గంలో ప్రయాణిస్తే.. ప్రజలు కూడా దుఃఖ మార్గంలోనే నడుస్తారు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించంగానే అయిపోదు. రాముడి పరిపాలనా దక్షతను పాలకులు పట్టుకోవాలి. శాస్త్రం చెప్పినట్టు ధర్మబద్ధంగా నడుచుకోవాలి. లేకుంటే అప్పటివరకు రామరాజ్యం ఉపన్యాసాలకే పరిమితమైంది.. కనీసం ఇప్పటినుంచైనా రామరాజ్యం వచ్చేలా పాలకులు తమ నిర్ణయాలను తీసుకుంటారని ఆశిద్దాం. . .