రామయ్యకు ఇష్టమైన రోజే కల్యాణం

రామయ్యకు ఇష్టమైన రోజే కల్యాణం

ఈసారి రామయ్య కల్యాణం ఆదివారం రావడం విశేషం. రామయ్యకు ఆదివారం అంటే ఎంతో ప్రీతికరమైనది. దీంతో ఆ రోజున స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకిస్తే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. రామచంద్రమూర్తి సూర్యవంశంలో జన్మించారు. మానవుడు వైవశ్వత మనువు సంతానం కాబట్టి మనమంతా మనుషులం. సూర్యుని కుమారుడు మనువు. మానవజాతికి ఆది పురుషుడని కూడా అంటారు. ఆది అనగా సూర్యుడు. అందుకే ఆదివంశం విశుద్ధుడు అని పేరు. ఆదివారం అనగా రామచంద్రునికి సంబంధించిన వారం. ఈ సారి ఆదివారం కల్యాణం కావడం ఎంతో విశేషం.

పురాణాల్లో సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా అభివర్ణించారు. సూర్యు డు, ఇతర గ్రహాలు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. మేరువు కుమారుడు భద్రుడు. ఆ భద్రమహర్షి వెలసిన క్షేత్రమే భద్రాద్రి. ఏ విధంగా మేరు చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయో అలాగే మేరుపుత్రుడైన భద్రుని కొండ చుట్టూ సకల దేవతల అనుగ్రహాలు తిరుగుతుంటాయి. అలా గ్రహాలన్నిం టికీ ప్రభువైన సూర్యుని వారం నాడే సకల దేవతలకు ప్రభువు అయిన రాముని కల్యాణం జరగడం విశేషం.

ఆదివారం కల్యాణం వీక్షించడం వల్ల పదవీలాభం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతుంటారు. భద్రాద్రి విశిష్టత మరెక్కడా కానరాదు రెండు చేతుల్లో లీలా పద్మాలు ఉంటే ఆ మూర్తిని లక్ష్మీదేవి అంటారు. ఆ రకంగా భద్రాచలంలో స్వయంభూగా వెలసిన రాముడు పద్మాసనంలో భక్తులకు దర్శనమిస్తే ఎడమ వామాం కము(తొడ) పై సీతమ్మ వారు ఆసీనులు కావడమే కాకుండా రెండు చేతుల్లో పద్మాలు దర్శనమిస్తాయి. ఎడమ చేయిలో పద్మం భక్తులకు దర్శనమిస్తుండగా కుడిచేతిలో పద్మం రామయ్య వీపునకు ఆనించి నట్లుగా ఉంటుంది. ఇటువంటి విలక్షణమైన రూపం మనం ఎక్కడా చూడలేం .

ఏ ఆలయంలోనైనా స్వామివారిని చూస్తే మధ్యలో స్వామి వారు దర్శనం ఇస్తారు. కానీ భద్రాద్రిలో మధ్యలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.  రెండు చేతుల్లో పద్మాలుండీ భద్రాద్రిలో లక్ష్మీ అమ్మవారు సీతామహాలక్ష్మిగా దర్శనమిస్తుంటే ఆమె భర్త రామనారాయణుడిగా దర్శనమిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. ఆస్థాన పురోహితులు సుప్రభాత సమయంలో పంచాగ పఠనం చేస్తారు. అభిషేక సమయంలో మంత్రాలు చెప్పడం, భక్త రామదాసు 24 చూర్ణికలతో రచించిన సంక్షిప్త రామాయణాన్ని పఠిస్తారు. భగవద్గీత, క్షేత్ర మహత్మ్యం నిత్య పారాయణం చేస్తారు. ఆలయాల్లో ఏ పూజా కార్యక్రమం ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించేది ఆస్థాన పురోహితులే. నెలసరి ఉత్సవాల తిధులు నిర్ణయించే వైదిక కమిటీలో వీరు సభ్యులు. అర్చకులు స్వామివారికి నిత్య పూజలతోపాటు ఆర్జితసేవలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల్లో వీరిదే ప్రధాన భూమిక.