
- షెడ్యూల్ రిలీజ్ చేసిన వైదిక కమిటీ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని మిథిలాస్టేడియంలో నిర్వహిస్తారు. 7న మహా పట్టాభిషేకం జరుగుతుంది.
మార్చి 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండగ రోజున ఉత్సవారంభం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఏప్రిల్2న గరుడపట లేఖనం, 3న భద్రక మండల లేఖనం, గరుడ పతావిష్కరణ, గరుడాధివాసం, 4న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుస్థానార్చన, భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం, 5న ఎదుర్కోలు ఉత్సవం, 6న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, సాయంత్రం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభం, 7న మహాపట్టాభిషేకం, రాత్రి రథోత్సవం,8న కల్యాణరాముడికి వేదపండితులతో మహదాశ్వీరచనం, 9న తెప్పోత్సవం, చోరోత్సవం,10న ఉంజల్సేవ, 11న వసంతోత్సవం, 12న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల30 నుంచి ఏప్రిల్ 12 వరకు స్వామి వారికి నిత్య కల్యాణాలు, దర్బారు సేవలు రద్దు చేశారు.