ఎస్సారెస్పీ నుంచి ఏప్రిల్ 9 వరకు సాగునీటి విడుదల

 ఎస్సారెస్పీ నుంచి ఏప్రిల్ 9 వరకు సాగునీటి విడుదల

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి కోసం ఏప్రిల్ 9 వరకే సాగునీటి విడుదల జరుగుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు.  రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి (శివం)కమిటీ నిర్ణయించిన నీటి ప్రణాళిక ప్రకారం కాకతీయ కెనాల్ ద్వారా రెండు జోన్లకు చివరి తడులు ఇవ్వనున్నారు. కాకతీయ కాలువ జోన్-2 ఆయకట్టుకు ఏప్రిల్ 2 ఉదయం 6గంటల వరకు, జోన్-1, సరస్వతీ కెనాల్, లక్ష్మి కెనాల్, అలీసాగర్, గుత్ప లిఫ్టు ఇరిగేషన్, చిన్న నీటిపారుదల లిఫ్టు స్కీంల కింద ఏప్రిల్ 9 ఉదయం 6గంటల వరకే సాగునీరు అందించనున్నారు. 

ఇదే చివరి తడులని ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదల సాధ్యపడదని ఆఫీసర్లు ప్రకటించారు. ప్రాజెక్టు లో నీటి నిల్వలు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1067.10 అడుగులు,18.83 టీఎంసీల నీరు ఉంది. ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించనున్నట్లు ఎస్ఈ పేర్కొన్నారు. ప్రస్తుతం కాకతీయ కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 కొనసాగుతున్న నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలకు యాసంగి సాగునీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కెనాల్ కు 5500 క్యూసెక్కులు,లక్ష్మీ కాలువకు250,అలీ సాగర్ 540,గుత్ప లిఫ్ట్ 405,సరస్వతీ కాలువకు 700 క్యూసెక్కులు,మిషన్ భగీరథ కు 232 క్యూసెక్కులు పోగా,అవిరిరూపంలో 459 క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది.