జనగామ, వెలుగు : జనగామలో బీఆర్‌ఎస్ బతకాలంటే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తప్పుకోవాలని ఆప్కో మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మండల శ్రీరాములు అన్నారు. జనగామలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్స్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తలు నారాజ్‌గా ఉన్నారన్నారు. ముత్తిరెడ్డితో పాటు ఆయన బావమరిది దందాలు చేస్తూ వేలాది ఎకరాలు ఆక్రమించారని ఆరోపించారు.
చేర్యాలలో కబ్జా చేసిన భూమిని సొంత ఆస్తిలా మున్సిపాలిటీకి రాసిస్తానని ఎమ్మెల్యే కూతురు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. హైకమాండ్ సర్వే చేసి ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇవ్వాలని కోరారు. ముత్తిరెడ్డిని కాదని స్థానికేతరుడిని తీసుకొస్తే సహకరించబోమని స్పష్టం చేశారు.