
శ్రీశైలం, వెలుగు : అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబికా దేవికి మంగళవారం కుంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆనవాయితీగా ఉగాది అనంతరం తొలి పౌర్ణమి తర్వాత మంగళవారం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆలయాన్ని మూసేస్తారు. కాల పూజలు మాత్రమే కొనసాగుతాయి.
సాయంత్రం చంద్రోదయం అనంతరం గర్భాలయం ఆలయాన్ని తెరిచి అమ్మవారిని కేవలం పసుపు, కుంకుమతో పూజిస్తారు. విగ్రహానికి ఎదురుగా ముఖ మండపంలోని శక్తి యంత్రం వెనకాల అన్నం రాసిగా పోసి అన్నకోటోత్సవం నిర్వహిస్తారు. పూర్వం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి కోళ్లు, మేకలను బలిచ్చేవారు. ఇది కాస్త స్వాతిక బలి దిశకు చేరింది. ప్రస్తుతం వేలకొద్ది నిమ్మ, గుమ్మడి, కొబ్బరి కాయలు సమర్పిస్తారు. ఏడాదిలో ఈ ఒక్క రోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం లభిస్తుంది. అమ్మవారు లోకాన్ని చల్లగా చూడాలని లోక కల్యాణం కోసం కుంభోత్సవం నిర్వహిస్తారు.