ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు
  • పులుల కోనలో మహా పాదయాత్రకు అధికారుల ఏర్పాట్లు
  • ఏపీ, తెలంగాణ నుంచి భారీగా రానున్న శివ స్వాములు

మహబూబ్​నగర్ ​/శ్రీశైలం, వెలుగు :  నల్లమల దట్టమైన అడవిలోని శ్రీశైల మల్లన్న  బ్రహ్మోత్సవాలు ఈనెల19 నుంచి మార్చి1 తేదీ వరకు జరగనున్నాయి. మహా శివరాత్రి నాటికి కాలి నడకన మల్లన్న క్షేత్రానికి చేరే శివ మాలధారులు, భక్తుల మహాయాత్ర సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గమధ్యలో ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ఆధ్యర్యంలో తాగునీరు,  దాతల సహకారంతో టిఫిన్లు, భోజనాలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.

శ్రీశైల మల్లన్న క్షేత్ర దర్శనానికి ప్రస్తుతం రెండు రూట్లే అందుబాటులో ఉండగా.. ఒకటి ఏపీలో.. మరొకటి తెలంగాణలో ఉంది. ఏపీ రూట్ నుంచి కర్నూలు, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని అయిజ, అలంపూర్, శాంతినగర్, కర్నాటకలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు వెళ్తుంటారు. తెలంగాణ రూట్ నుంచి హైదరాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్, కర్నాటకలోని గుర్మిట్కల్, రాయ్ చూర్ ప్రాంతాల భక్తులు పాదయాత్రగా తరలివెళ్తుంటారు.

నాలుగు రూట్లలో మొదటిది తూర్పున మార్కాపురం వైపున చుక్కల పర్వతం మార్గం, రెండోది వినుకొండ మార్గం ఇప్పుడు అందుబాటులో లేవు. మూడోది సిద్ధవటం -ఆత్మకూరు నుంచి శ్రీశైలం దాకా ఉంటుంది. ప్రస్తుతం ఇటునుంచే భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భక్తులు ఆత్మకూరు నుంచి అడవి వెంకటాపూర్​వరకు బస్సులో వస్తారు.

అక్కడ దిగి ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తారు. నాలుగోది ఉత్తర దిక్కు నుంచి శ్రీశైలం వచ్చే యాత్రికులు నాగర్ కర్నూల్ మీదుగా అమ్రాబాద్, తెలకపల్లి, ఉమామ హేశ్వరం, వటవర్లపల్లి వద్ద కృష్ణానది దాటి అక్కడి నుంచి నల్లమల కొండలను ఎక్కి శ్రీశైలం చేరుకుంటారు. ఈ మార్గాన్ని జాతర గంగ మార్గమని పిలుస్తారు.

స్పీడ్ గా ఏర్పాట్లు

మల్లన్న బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల ఆఫీసర్లు స్పీడ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీటి కోసం ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం మట్టి రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు, అదనపు క్యూలైన్లు, టూరిస్ట్ బస్టాండ్​,శివ దీక్ష శిబిరాలు, ఆలయం ముందు భక్తులు విశ్రాంతికి భారీ షెడ్లు నిర్మిస్తున్నారు.

పాతాళగంగ వద్ద మహిళలు, పిల్లలు, పెద్దలు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా బారి కేడ్లు, పెన్సింగ్ పనులు కొనసాగిస్తున్నారు. వెహికల్స్​ కోసం ప్రత్యేకంగా పార్కింగ్​స్థలాలు కేటాయించారు. క్షేత్రంలో పది చోట్ల మైక్ అనౌన్స్ మెంట్ సెంటర్లు అమర్చుతున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేలా అధికారులు, సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు.


బ్రహ్మోత్సవాల షెడ్యూల్​

ఈనెల19న ధ్వజారోహణం, శ్రీకాళహస్తి దేవస్థానం పట్టువస్ర్తాల సమర్పణ, 20న భృంగి వాహన సేవ, ద్వారకా తిరుమల దేవస్థానం పట్టు వస్ర్తాల సమర్పణ, 21న హంస వాహన సేవ, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టు వస్ర్తాల అందజేత, 22న మయూర వాహన సేవ, తిరుమల తిరుపతి, కాణిపాకం దేవస్థానాల ఆధ్వర్యంలో వేర్వేరుగా పట్టు వస్ర్తాల సమర్పణ, 23న రావణ వాహన సేవ, రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాల అందజేత, 24న పుష్ప పల్లకీ సేవ, 25న గజ వాహన సేవ, 26న మహా శివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహన సేవ, లింగోద్భవకాల మహా రుద్రాభిషేకం, పాగాలంకరణ, కల్యాణోత్సవం, 27న రథోత్సవం, తెప్పోత్సవం, 28న ధ్వజారోహణం, మార్చి 1న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.