- శ్రీశైలం, నాగార్జున సాగర్, పెద్దవాగు మెయింటెనెన్స్ గాలికొదిలేసిన పక్క రాష్ట్రం
- వాళ్లు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ప్లంజ్‌పూల్‌లో భారీ గొయ్యి ఏర్పడినా రిపేర్లు చేపట్టట్లేదు
- మనం ఆపరేట్ చేస్తున్న సాగర్‌లో సగం చెరబట్టి,
- మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు.. పెద్దవాగు విషయంలోనూ అదే తీరు
- కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం, నాగార్జునసాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి కేటాయింపులకు మించి నీటిని తరలించుకుపోతున్న ఏపీ.. ఆ ప్రాజెక్టుల నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. ఈ విషయమై కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ)కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఆ రాష్ట్రానికి లేఖలు రాస్తున్నా ప్రయోజనం లేకుండా పోతున్నది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు గోదావరి బేసిన్‌లోని పెద్దవాగు ప్రాజెక్టు రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ ఆపరేట్చేస్తుండగా, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆపరేషన్లు తెలంగాణ చేతిలో ఉన్నాయి. పెద్దవాగును రెండు రాష్ట్రాలు కలిసి నిర్వహిస్తున్నాయి. కానీ ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి రిపేర్లు, మెయింటెనెన్స్ వ్యవహారాల్లో ఏపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
శ్రీశైలానికి రిపేర్లు చేయట్లే..
శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. 2009లో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్ ప్లంజ్ పూల్‌లో (గేట్ల నుంచి వరద జారి కింద మళ్లీ పైకి ఎగిరి నదిలో పడే ప్రాంతం) భారీ గొయ్యి ఏర్పడినట్టు నిపుణుల కమిటీ 2014లో తేల్చింది. నిరుడు ఫిబ్రవరిలో ప్రాజెక్టును సందర్శించిన నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), ఏపీ, తెలంగాణ అధికారుల నిపుణుల కమిటీ.. ఆ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవుతో ఉన్నట్టు తేల్చింది. ఈ గొయ్యి వల్ల డ్యామ్ పునాదులూ బలహీనంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది. అలాగే ప్రాజెక్టులోని 490 అడుగుల నీటి మట్టం వద్ద ఉన్న గ్యాలరీ దగ్గర సీపేజీ అవుతున్నట్టూ గుర్తించారు. వాటికి వెనువెంటనే రిపేర్లు చేయకుంటే పెను ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరించారు. ఉన్నట్టుండి భారీ వరద వచ్చి డ్యామ్‌కు జరగరాని ప్రమాదం జరిగితే కింద ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకూ ముప్పు తప్పదని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా దానికి రిపేర్లు చేయించాలని ఏపీకి పలుమార్లు లేఖలు రాశారు. అలాగే కేఆర్ఎంబీ మీటింగ్స్ లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. అంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నా ఏపీకి మాత్రం చీమకుట్టినట్టయినా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం డ్రిప్కింద కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప.. నిధులు విడుదల చేసి దానికి రిపేర్లు చేయించాలనే ఉద్దేశంతో ఏపీ పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
సాగర్ ఖర్చంతా మనదే..
ఆపరేషన్లలో భాగంగా మన అధీనంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మన ప్రభుత్వమే రిపేర్లు చేయిస్తున్నది. వాటి పూర్తి ఖర్చునూ భరిస్తున్నది. కానీ, ఏపీ మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నది. నిత్యం సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణలకు కాలు దువ్వుతున్నది. అందులో భాగంగానే 2018లో మన అధికారులతో గొడవకు దిగింది. సాగర్ ప్రాజెక్టులోని 14వ గేట్ నుంచి కుడివైపు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుంది. వాస్తవానికి ప్రాజెక్టును మనమే ఆపరేట్ చేయాల్సి ఉన్నా.. సాగర్ కుడి కాల్వను ఏపీనే నిర్వహిస్తున్నది. ఇటు ప్రాజెక్ట్ గేట్లను కూడా తన అధీనంలోకి తీసుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నది. అయితే, సగం ప్రాజెక్టును చెరబట్టినా ఆ ప్రాజెక్టు రిపేర్లకయ్యే ఖర్చులకు మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదు. నిరుడు ప్రాజెక్టు గేట్లు, స్పిల్‌వే, ఇతర సమస్యలకు రిపేర్లు చేయించాలని ఎన్డీఎస్ఏ సూచించింది. అందుకు అనుగుణంగా మన ప్రభుత్వం రిపేర్లను చేయించేందుకు సిద్ధపడినా.. రిపేర్లు ఆపించేందుకు ఏపీ ప్రయత్నించింది. రిపేర్లు చేయొద్దంటూ కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేసి అడ్డుతగిలింది. సగం రిపేర్లు చేయించేందుకు ముందుకురాకపోగా.. రిపేర్లు చేయిస్తున్న మనకు అడ్డుతగిలింది. ఇటు తాజాగా స్పిల్ వేపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు మన ప్రభుత్వమే ముందడుగు వేసింది. దానిపై ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది.
గతంలో ఐఐటీ రూర్కీతోనే అధ్యయనం
ఐఐటీ రూర్కీ అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్టుకు అనుగుణంగా ముందుకెళ్లాలని మన అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఇప్పటికే గతంలో ఓసారి సాగర్ స్పిల్‌వేపై ఐఐటీ రూర్కీనే స్టడీ చేసిందని అధికారులు చెబుతున్నారు. ఒకసారి ఆ రిపోర్టును పరిశీలించి.. మరోసారి అధ్యయనం చేయించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. పాత రిపోర్టులోని అంశాల ఆధారంగా మరోసారి ఐఐటీ నిపుణులతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నారు. వారు చెప్పే అంశాల ఆధారంగా ప్రాజెక్టుకు రిపేర్లపై ముందుకెళ్లనున్నారు. మరోవైపు స్పిల్‌వే వద్దకు వెళ్లేందుకు సరైన యాక్సెస్ లేదని, దీంతో పనులు చేయించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏ పనిచేయాలన్నా.. అక్కడకు ఏం తీసుకెళ్లాలన్నా మాన్యువల్‌గా తీసుకెళ్లడం చాలా కష్టమవుతున్నదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ భారీ టవర్క్రేన్ను ఏర్పాటు చేయించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. కనీసం 60 మీటర్ల ఎత్తుతో, 480 మీటర్ల దూరం వరకు వెళ్లేలా ఆ టవర్ ఉండాలని చెబుతున్నారు. దానికి సంబంధించి జాతీయ స్థాయి కంపెనీలకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)పెట్టాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది.
పెద్దవాగుపైనా అదే ధోరణి..
గోదావరి బేసిన్‌లోని పెద్దవాగు ప్రాజెక్టుపైనా ఏపీ అదే ధోరణితో వ్యవహరిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నది. దీని కింద తెలంగాణలో కేవలం 2,700 ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఏపీలో మాత్రం 13,300 ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి బేసిన్లో దీన్ని ఉమ్మడి ప్రాజెక్టుగా పేర్కొంటూ కేంద్రం గెజిట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఏపీ కూడా దాని నిర్వహణకు 85 శాతం వరకు నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, ప్రాజెక్టు నుంచి లబ్ధి పొందుతున్న ఏపీ.. దానికి రిపేర్లు, మెయింటెనెన్స్ విషయంలో మాత్రం నోరెత్తడం లేదు. నిరుడు వచ్చిన వరదలకు ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దానికి తాత్కాలిక రిపేర్లకు తెలంగాణ ప్రభుత్వమే రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఏపీ మాత్రం పైసా ఇవ్వలేదు. దీనిపై ఏపీకి మన అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందన శూన్యం. దీంతో ఏపీ వ్యవహారంపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఫిర్యాదు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో జీఆర్ఎంబీకి త్వరలోనే లేఖ రాయనున్నట్టు సమాచారం. అంతేగాకుండా కేంద్రం ఆధ్వర్యంలో డ్యామ్ రీహాబిలిటేషన్ ఇరిగేషన్ ప్రోగ్రాం (డ్రిప్) కింద కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. రూ.90 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారని తెలుస్తున్నది. ఈ అంశంపైనా కేఆర్ఎంబీ మీటింగ్ అనంతరం ఏపీ ఈఎన్సీతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
కేఆర్ఎంబీ మీటింగ్‌లో ఫిర్యాదు!
ఏపీ తీరుపై ఈ నెల 21న జరగనున్న కేఆర్ఎంబీ మీటింగ్‌లో తెలంగాణ ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అంశంలోనూ ఏపీ మొండిగా వ్యవహరిస్తున్నదని ఎత్తిచూపనుంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఎవరెన్ని నీళ్లు వాడుతున్నారో లెక్కలు తీసేందుకు టెలిమెట్రీ విధానాన్ని ఏర్పాటు చేయించాలని పట్టుబట్టనున్నట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఏపీ వాళ్లు ముందుకు రాకుంటే మనం తొలుత నిధులు కేటాయించి టెలిమెట్రీని ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు చెప్పినట్టు తెలిసింది.