AP News: శ్రీశైలం జలాశయం గేట్లు మూసివేత..

శ్రీశైల జలాశయానికి చెందిన గేట్లను సోమవారం ( ఆగస్టు 12) డ్యామ్ అధికారులు మూసివేశారు. దీంతో శ్రీశైలం జలాశయంలో మత్స్యకారులు హడావిడి చేశారు.  చిన్న చిన్న బుట్టలు వేసుకొని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వచ్చారు.  మత్స్యకారులు బుట్టల్లో వస్తున్న దృశ్యాలను చూసిన యాత్రికులు అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.  ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దీంతో అక్కడి అధికారులు ఆ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు.

 గత కొన్ని రోజులుగా  భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం  గేట్లు ఎత్తి నీటిని  కిందకి వదిలారు.   ఆ సమయంలో వరద ప్రవాహం ఎక్కువుగా ఉండటంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.  ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో  మత్స్యకారులు  చేపల వేటకు బయలుదేరారు. 

 ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి మాత్రమే నీరు వస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా తగ్గింది. ఈ క్రమంలో జలాశయంకు చెందిన అన్ని గేట్లను డ్యాం ఇంజనీర్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగో సుంకేసుల బ్యారేజీ నుంచి 77వేల 598 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతుంది. ఇక జలాశయం 885 అడుగుల గాను 881.20 అడుగులుగా ఉంది. 215 టీఎంసీల నీటి నిల్వలకు గాను 194.3096 టీఎంసీలను నీటి నిల్వలు ప్రస్తుతం జలాశయంలో ఉన్నాయి. అయితే వరద నీటితో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల సహాయంతో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది