నిండుకుండలా శ్రీశైలం.. పది గేట్లు ఎత్తిన అధికారులు

  • 209 టీఎంసీలు దాటిన నీటి నిల్వ 
  • పది గేట్లు పది అడుగుల మేర ఎత్తిన అధికారులు 
  • నాగార్జునసాగర్​కు తరలుతున్న కృష్ణమ్మ  

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరు కుంది. ఎగువ ప్రాంతాల నుంచి నిరంతరాయంగా వరద వస్తుండడంతో మంగళవారం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 

ఇన్ ఫ్లో పెరగడంతో...

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మంగళవారం ఉదయం పది గంటల వరకు మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన ఆఫీసర్లు..తర్వాత మరో రెండు గేట్లను ఎత్తి ఐదు గేట్ల ద్వారా నీటిని వదిలారు. మధ్యాహ్నం ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరగడంతో ఇన్​ఫ్లో నాలుగు లక్షలకు పెరిగింది. దీంతో అలర్టయిన అధికారులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరో రెండు గేట్లను ఎత్తారు. దీంతో ఎత్తిన గేట్ల సంఖ్య ఏడుకు చేరింది. వరద ఉధృతి ఇంకా పెరగడంతో మొత్తం పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. 

ఇన్​ ఫ్లో 3,79, 822 క్యూసెక్కులు నమోదు కాగా, అవుట్​ ఫ్లో  3,32, 447 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 883.50 అడుగుల నీరుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలు కాగా,  ప్రస్తుతం 209.5948 టీఎంసీలు ఉంది.  కుడి, ఎడమ జల విద్యుత్​ కేంద్రాల ద్వారా విద్యుత్​ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. గేట్ల ఎత్తడంతో పాటు పవర్​ జనరేషన్​ ద్వారా దిగువకు సుమారు రెండున్నర లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. 
నదిలో పడవలు నడపొద్దు శ్రీశైలం డ్యాంకు కృష్ణానది ఎగువ పరివాహక ప్రాం తాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్​లో పడవలు నడపొద్దని ఏపీ టూరిజం మేనేజర్, మత్స్యకార బోట్  ఆపరేటర్లకు సీఐ ప్రసాదరావు నోటీసులిచ్చారు. 

కృష్ణా తీర ప్రాంత గ్రామాలకు హై అలర్ట్​ 

నాగర్​కర్నూల్: కృష్ణానదికి వరద పెరగడంతో కొల్లాపూర్​ నియోజకవర్గ రెవెన్యూ, పోలీస్ ​అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని కృష్ణాతీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు,మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణానదిలో పడవలు నడిపేవారికి సూచనలు చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల వరద తాకిడితో శ్రీశైలంలో దాదాపు 883 అడుగుల వరకు నీరు చేరడంతో కృష్ణా బ్యాక్​ వాటర్​ సోమశిల, ఎల్లూరు, అమరగిరి తీర ప్రాంతాలను తాకింది. 

పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మల్లేశ్వరం తీర గ్రామాలకు కృష్ణా వరదనీరు చేరింది. మంచాలకట్ట వద్ద దాదాపుగా సముద్రాన్ని తలపిస్తోంది.  తెలంగాణ, ఏపీల మధ్య బోట్ల రాకపోకలు బంద్​ కృష్ణానదిలో తుంగభద్ర నది కలిసే ప్రాంతం నుంచి దిగువకు వరద ఉధృతి పెరుగుతోంది. మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, మాధవస్వామి నగర్ ​నుంచి ఏపీలోని నెహ్రూనగర్, ముచ్చుమర్రి, పగిడాల, జానాల, సిద్దేశ్వరం తీర ప్రాంత గ్రామాలకు బోట్ల ప్రయాణాలు మానుకోవాలని కొల్లాపూర్​ఆర్డీఓ నాగరాజు, పోలీసులు బోట్ల యజమానులను హెచ్చరించారు. 

పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, మాధవస్వామినగర్, చిన్నంబావి మండంలోని చెల్లపాడు, వెల్టూరు ఇతర తీర గ్రామ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రెవెన్యూ, మండల అధికారులతో పాటు గ్రామస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సోమశిల వద్ద కిలోమీటర్​లోపలికి వెళ్లిన తిరుగు జలాలు వరదతో రెండు రోజుల్లో పుష్కర ఘాట్లను తాకాయి. అమరగిరి, ఇతర ప్రాంతాల్లోను దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. 

డ్యామ్ దిగువన తప్పిన ప్రమాదం 

శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోని పాతాళగంగ బ్రిడ్జి కింద మధ్యాహ్నం ప్రమాదం తప్పింది. బ్రిడ్జి కింద వికారాబాద్ జిల్లా దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, స్నేహితులు నది స్నానాల కోసం కారును బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లారు. అక్కడే కారును ఆపి స్నానాలకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వరద పెరగడంతో అప్పటికే ఐదు గేట్లను ఎత్తిన అధికారులు, అదనంగా మరో రెండు గేట్లను ఎత్తారు.

 దీంతో దిగువన వరద ఉధృతి పెరిగింది. బ్రిడ్జి కింద ఉన్న కారు నదిలో సగం వరకు మునిగిపోయింది. వెంటనే గమనించిన కృష్ణ, అతడి స్నేహితులు మత్స్యకారులు, స్థానికుల సాయంతో నీటిలో ఉన్న కారును బయటకు లాగారు. కారును బయటకు తీయడానికి దాదాపు అరగంట శ్రమించారు.

పెరగనున్న పర్యాటకుల తాకిడి..

గతేడాది కృష్ణానదికి ఆశించిన స్థాయిలో ప్రవాహం లేకపోవడంతో వానాకాలంలో సైతం కృష్ణా జలాలు సోమశిల బ్యాక్​వాటర్​లో ఉన్న దర్గా వద్దకు కూడా చేరలేదు. ఈ సీజన్​లో జూలై చివరి నాటికి పుష్కరఘాట్లను తాకిన కృష్ణా జలాలతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టుల రద్దీ పెరిగే ఛాన్స్​ ఉంది. సోమశిలలో టూరిజం కాటేజీలు, ప్రైవేట్​కాటేజీలు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్​వాటర్​బోటింగ్​కు ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తారు. అమరగిరికి వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డును బాగుచేస్తే అమరగిరి వైపు పర్యాటకుల రద్దీ పెరిగే ఛాన్స్​ ఉంది.