గరిష్ట నీటిమట్టానికి చేరుకున్న శ్రీశైలం... రేపు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది రోజులుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం వడివడిగా పెరుగుతూ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఎగువన అటు కృష్ణానదిపై జూరాల నుంచి.. మరో వైపు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరదనీరు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుకుంటోంది. 
డ్యామ్ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రేపు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లో లక్షా 52 వేల 396 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 195.21 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రేపు అంటే శనివారం శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరచి నీటి విడుదల ప్రారంభించనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.