
నాగర్‌కర్నూల్ / అమ్రాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్–1లో లోపలే చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను బయటకు తీసుకురావడం కష్టతరంగా మారింది. మోకాళ్ల లోతులో మట్టి, బురద కూరుకుపోయిందని, టన్నెల్ లోపలకి వెళ్లే పరిస్థితే లేదని SDRF టీం ఆదివారం ఉదయం తేల్చి చెప్పింది. లోపల చిక్కుకున్న వారిని కాపాడుకునేందుకు మరో ప్రత్యామ్నయం ఆలోచించాలని SDRF బృందం తెలిపింది.
Nagarkurnool, Telangana: An SDRF personnel says, "There's no chance to go to the spot inside the tunnel. It has completely collapsed and mud is reaching up to the knees. We will have to take another step." pic.twitter.com/BQ5nrLm4Yd
— ANI (@ANI) February 22, 2025
శనివారం ఉదయం 9 గంటలకు టన్నెల్ ఎంట్రెన్స్ నుంచి 14వ కిలో మీటర్ పాయింట్(నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట) వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషిన్‌తో పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ టైమ్‌లో ఇంజినీర్లు, ఆపరేటర్లు, కార్మికులు కలిపి 50 మంది టన్నెల్ లోపల విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం 42 మంది సురక్షితంగా బయటకు రాగా.. కూలిన ప్రాంతంలో టన్నెల్బోర్మిషిన్వద్ద ఉన్న 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతమంతా మట్టి, రాళ్లు, నీళ్లు, బురదతో నిండిపోయింది.
ఐదేండ్ల కింద నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు నాలుగు రోజుల కిందే ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 8గంటలకు ప్రాజెక్ట్, ఫీల్డ్ ఇంజినీర్లు, జనరేటర్ ఆపరేటర్లు, కార్మికులు 50 మంది టన్నెల్ లోపలికి వెళ్లి 14వ కిలోమీటర్ వద్ద పనులు ప్రారంభించారు. టన్నెల్బోర్ డ్రిల్లింగ్మిషన్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మట్టి రాలడం, నీళ్లు(సీపేజ్) వస్తుండడాన్ని గమనించిన టన్నెల్ బోరింగ్ ఆపరేటర్ మిగతా సిబ్బందిని అలర్ట్ చేశాడు. బోర్డ్రిల్లింగ్మిషన్కు రెండుపక్కలా ఉన్నవాళ్లు అలర్ట్అయ్యేలోగా పైన గతంలో వేసిన కాంక్రీట్స్లాబ్ సహా మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఆ ప్రాంతమంతా రాళ్లు, మట్టి, బుదరతో నిండిపోయింది.
బోర్మిషన్కు ఇవతలి వైపు ఉన్న 42 మంది బయటకు వచ్చినా మిషన్దగ్గర్లో ఉన్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వారిలో పలువురు స్వల్పంగా గాయపడగా, వారికి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టన్నెల్‌లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో అంతా అయోమయం నెలకొంది. జెన్‌కో ఆఫీసర్లు అలర్ట్ అయి హుటాహుటిన కరెంట్సరఫరాను పునరుద్ధరించారు.
టన్నెల్‌లో పనులు జరుగుతున్న టైమ్‌లో అక్కడ ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేకంగా పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. టన్నెల్‌లో పనులు ప్రారంభమైన నాటి నుంచే ఈ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో టన్నెల్‌లో ప్రస్తుతం ఆక్సిజన్‌కు ఇబ్బంది లేనప్పటికీ.. కాంక్రీట్స్లాబ్, మట్టి, రాళ్లు, బరద మీదపడ్డ వారి పరిస్థితి ఎలా ఉందో అంతుచిక్కడం లేదు.