- కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ
- నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్, ఎడమ కాలువ, పులి చింతల పవర్ హౌస్ మావే
- ఆర్ఎంసీ మీటింగ్ పై బోర్డుకు ఈ ఎన్సీ లెటర్
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టులో ఉత్పత్తి చేసే కరెంట్‌లో తమకు మూడు వంతుల వాటా ఉందని కృష్ణా బోర్డుకు తెలంగాణ తేల్చిచెప్పింది. నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్‌తో పాటు ఎడమ కాలువ, పులిచింతల పవర్ హౌస్‌లు తమకు మాత్రమే చెందుతాయని స్పష్టం చేసింది. కేఆర్‌ఎంబీ రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై రాష్ట్ర అభిప్రాయాలు వెల్లడిస్తూ ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మరళీధర్.. మంగళవారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు లేఖ రాశారు. శ్రీశైలం నుంచి కరెంట్ ఉత్పత్తికి 222.5 టీఎంసీల నీటిని ఉపయోగించి నాగార్జున సాగర్‌కు విడుదల చేయాల్సి ఉంటుందని, ఇందులో తెలంగాణకు 168.5 టీఎంసీలు దక్కుతాయని తెలిపారు. ఏపీ కేవలం 54 టీఎంసీల నీటిని మాత్రమే కరెంట్ ఉత్పత్తికి ఉపయోగిస్తూ సాగర్‌కు విడుదల చేయాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. దీనిపై జూన్ ఆరో తేదీనే స్పష్టత ఇస్తూ బోర్డుకు లేఖ రాశామని గుర్తు చేశారు. నాగార్జునసాగర్, పులిచింతల పవర్ హౌస్‌లలో వాటా అడిగేందుకు ఏపీకి హక్కు లేదని స్పష్టం చేశారు.
ఏపీని కట్టడి చేయండి
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోకుండా కట్టడి చేయాలని కృష్ణా బోర్డును ఈఎన్సీ కోరారు. ఆ నీటిని ఏటా జులై నుంచి అక్టోబర్ నెలాఖరులోపే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది కరెంట్ ఉత్పత్తి కోసమేనని, పవర్ జనరేషన్ ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేయాలని నిర్దేశించారని గుర్తుచేశారు. శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 830 అడుగులుగానే ఉండాలని, రూల్స్ కర్వ్స్‌లో ప్రతిపాదించిన 854 అడుగులకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. పులిచింతల, కృష్ణా డెల్టా సిస్టం అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయడానికి వీల్లేదన్నారు. 75 శాతం డిపెండబులిటీ వద్ద శ్రీశైలంలో 583 టీఎంసీల లభ్యత ఉందని, అందులో తెలంగాణ అవసరాలు ఎస్‌ఎల్బీసీ 40 టీఎంసీలు, కల్వకుర్తి 40, నెట్టెంపాడు 25.4, పాలమూరు - రంగారెడ్డి 90, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు ఉన్నాయని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
తరలించే నీళ్లను లెక్కించాల్సిందే
బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ -1)లోని 6, 13 క్లాజుల ప్రకారం ప్రాజెక్టుల నుంచి తరలించే మొత్తం నీళ్లను లెక్కించాల్సిందేనని తెలంగాణ తేల్చిచెప్పింది. వరద, నికర జలాలు ఏవి అనే దానిపై ట్రిబ్యునల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 4.22 టీఎంసీలను తరలించుకోగల సామర్థ్యం ఏపీకి ఉండగా.. తెలంగాణ కేవలం 0.27 టీఎంసీలు మాత్రమే తరలించుకోగలదని తెలిపారు. తెలంగాణతో పోల్చితే ఏపీ 15 రెట్లు ఎక్కువగా నీటిని తరలించుకోగలదని చెప్పారు. శ్రీశైలం నుంచి తరలించే నీటిని నిల్వ చేసుకోవడానికి ఏపీలో 360 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించారని వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ నిండి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో ఏపీ తరలించుకునే నీటికి సమానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోని నిల్వ నీటిని తెలంగాణ ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ఆపాలె
ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఆర్డీఎస్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ నిర్మించిందని, బోర్డు జోక్యం చేసుకొని పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కోరింది. ఈ మేరకు ఇరిగేషన్ ఈఎన్సీ (జనరల్) మురళీధర్ మంగళవారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు లేఖ రాశారు. బ్రజేశ్ కుమార్ (కేడబ్ల్యూడీటీ -2) ట్రిబ్యునల్ కేటాయింపులు తేలకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడానికి వీల్లేదని తెలిపారు. ఆర్డీఎస్ రైట్ కెనాల్‌కు నీటి కేటాయింపులను తాము బ్రజేశ్ ట్రిబ్యునల్ ఎదుట సవాల్ చేశామని గుర్తు చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టాన్ని అతిక్రమించి ఈ పనులు చేపడుతోందని, జోక్యం చేసుకొని పనులు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.