సంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్​ కౌన్సిల్​ అనుమతి లేకుండానే సంగమేశ్వరం (రాయలసీమ ఎత్తిపోతల) ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయాలని అపెక్స్​, కేంద్రం ఆదేశించినా.. నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా సమస్య తెలియనట్టు ఊరుకుంటోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో లక్షల కోట్లు వ్యయం చేసి నిర్మాణం చేపట్టిన, చేపడుతున్న ప్రాజెక్టులకు నీటి లభ్యత లేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోయే స్థితి వస్తుంది. లక్షలాది ఎకరాలకు నీరందక దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఇది పర్యావరణానికి కూడా పెను ప్రమాదమే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 5న జీవో నంబర్​ 203ను జారీ చేసింది. సంగమేశ్వరం(రాయలసీమ ఎత్తిపోతల) ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్​ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తోడి శ్రీశైలం కుడి ప్రధాన కాల్వలో పోస్తామని అందులో పేర్కొంది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ను 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయడం (దీని నుంచి రోజుకు 7 టీఎంసీల నీరు దిగువకు వెళుతుంది. గతంలో 4 టీఎంసీలు మాత్రమే వెళ్లేది) గురించి ప్రస్తావించింది. శ్రీశైలం కుడి కాల్వ, గాలేరు–నగరి, సుజల స్రవంతి కాల్వలను పొడిగించడం ద్వారా రాయబోటి, తంబళ్లపల్లి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం, అలాగే రెండు కాల్వల ద్వారా మదనపల్లి, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కు రూ.6,829.15 కోట్లు కేటాయించింది. ఈ జీవోపై అపెక్స్ కౌన్సిల్​లో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని అపెక్స్​ కౌన్సిల్​ ఆదేశించింది.

150 టీఎంసీలు అదనంగా వాడుకునే ప్రయత్నం

తెలంగాణ 299 టీఎంసీలు కృష్ణా నికర జలాలు వినియోగించుకోవాలి. మిగులు జలాల ఆధారంగా కల్వకుర్తి ఎత్తిపోతలు (4 లక్షల ఎకరాలు, 40 టీఎంసీలు), ఎస్ఎల్బీసీ (3.70 లక్షల ఎకరాలు 33, 22 టీఎంసీలు), బీమా 1, 2వ దశలు (2 లక్షల ఎకరాలు, 20 టీఎంసీలు), నెట్టెంపాడు (2 లక్షల ఎకరాలు, 22 టీఎంసీలు) వాడుకోవడానికి నిర్మాణాలు పూర్తయ్యాయి. మొత్తం 11.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు 119.22 టీఎంసీల మిగులు జలాలను కృష్ణా నది నుంచి తెలంగాణ వాడుకోవాలి. వీటికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టరాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా మిగులు జలాల ఆధారంగా హంద్రి-నీవా(6.12 లక్షల ఎకరాలు, 40 టీఎంసీలు), గాలేరు–నగరి(2.60 లక్షల ఎకరాలు, 38 టీఎంసీలు), వెలిగొండ(4.38 లక్షల ఎకరాలు, 43.50 టీఎంసీలు), తెలుగుగంగ (5.25 లక్షల ఎకరాలు, 29.50 టీఎంసీలు) ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తంగా 20.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 151 టీఎంసీలతో ఈ నిర్మాణాలు జరిగాయి. తెలంగాణలో 11–13 లక్షల ఎకరాలకు 119.22 టీఎంసీలు, ఏపీలో 20.25 లక్షల ఎకరాలకు 151 టీఎంసీల మిగులు జలాలు వినియోగంలోకి తెచ్చేలా నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 203 జీవోను తెచ్చి శ్రీశైలం నుంచి మరో 150 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.

705 అడుగుల వరకు నీటిని తోడేయవచ్చు

రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్​ వాటర్​ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున 705 అడుగుల వరకు నీటిని తోడి పోయవచ్చు. అప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో 3.42 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 805 అడుగుల వద్ద (పోతిరెడ్డిపాడు) లిఫ్ట్ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నది. అప్పుడు శ్రీశైలంలో అసలు నీరే ఉండదు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెచ్చిన జీవో 69 ప్రకారం.. శ్రీశైలంలో 834 అడుగుల వరకు మాత్రమే నీటిని వాడుకోవాలి. అప్పుడు ప్రాజెక్టులో 53.85 టీఎంసీల నీరు ఉంటుంది. అవి డెడ్ స్టోరేజీగా ఉండాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2004లో వైఎస్ సీఎంగా ఉండగా ఇచ్చిన జీవో 107 ప్రకారం.. శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీటిని వాడుకోవచ్చు. అప్పుడు 89.29 టీఎంసీలు డెడ్ స్టోరేజీ ఉంటుంది. ఈ రెండు జీవోలను బేఖాతరు చేస్తూ ప్రస్తుత ఏపీ సీఎం జగన్ జీవో 203 తెచ్చారు. ఈ ప్రకారం నీటిని తగ్గిస్తే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. కల్వకుర్తి ఎత్తిపోతలు, పాలమూరు ఎత్తిపోతల పథకాలు 830 అడుగుల నీరు ఉన్నప్పుడే ఉపయోగపడతాయి. అతికష్టంపై 814 అడుగుల వరకు నీటిని తోడవచ్చు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నల్గొండ జిల్లాకు పూర్తైన తర్వాత వాడుకోవాలన్నా ప్రాజెక్టులో 830 అడుగుల నీరు ఉండాలి.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ కొర్రీలు

గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, సీతారామ సాగర్ ప్రాజెక్టులను కొత్తగా నిర్మిస్తోందని, దాని వల్ల గోదావరి డెల్టా ఆయకట్టుకు నీరు రాదని ఏపీ అభ్యంతరం చెబుతోంది. అలాగే కృష్ణా నదిపై పాలమూరు ఎత్తిపోతల నిర్మించి 120 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చారని ఆరోపిస్తోంది. అయితే ఈ మూడు ప్రాజెక్ట్ లు పాతవేనని, రీ-డిజైన్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసింది. గోదావరిపై వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ గా, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెంలను సీతారామ సాగర్ ప్రాజెక్ట్ గా రీ-డిజైన్ చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశం ఏపీకి మారింది. పోలవరం ముంపు పేరుతో తెలంగాణకు చెందిన 5 మండలాలను ఏపీకి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ హయాంలో చేపట్టి కొంతమేరకు పనులు జరిపిన పాలమూరు ఎత్తిపోతలను జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటి లభ్యత కోసం శ్రీశైలం ప్రాజెక్ట్ ముందు భాగానికి మార్చారు. మిగిలిన తెలంగాణ ప్రాజెక్ట్ లు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా 1, 2వ దశలు మిగులు జలాల ఆధారంగా నిర్మాణం పూర్తయ్యాయి.

న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలి

తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందడమే కాక, బ్రిజేశ్​ కుమార్ ట్రిబ్యునల్​కు వీటి నివేదికలు కూడా సమర్పించారు. అయినా ఏపీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్ట్ లు కూడా కొత్తగా జరుగుతున్నట్లు, తమ రాష్ట్రానికి నష్టం వస్తున్నట్టు అపెక్స్ బోర్డులో అభ్యంతరాన్ని తెలిపింది. దీనిపై స్పందించిన అపెక్స్​ కౌన్సిల్​.. తాము అనుమతిచ్చే వరకు నిర్మాణాలు చేపట్టవద్దని, అన్ని ప్రాజెక్ట్ ల డీపీఆర్​లు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. వాస్తవానికి ఈ డీపీఆర్​లు కేంద్ర జల సంఘం వద్దే ఉన్నాయి. అయినా ఏపీ సంగమేశ్వరం నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. ఇంతకు ముందు పర్యావరణ రక్షణ కోసం కృష్ణా నదిలో 16 టీఎంసీల నీటిని ప్రవాహానికి కేటాయించాలని బ్రిజేశ్​ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు(2010)లో చెప్పింది. దానిని కూడా ఏపీ వ్యతిరేకిస్తున్నది. అందువల్ల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైలం జలాల వినియోగాన్ని న్యాయబద్ధంగా పరిష్కరించుకుని, దానిపై బ్రిజేశ్​ ట్రిబ్యునల్  ఆమోదం పొందాలి.

డెడ్​స్టోరేజీ వాడేస్తే ప్రాజెక్టు నిండడం కష్టం

శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తగ్గుతున్నప్పుడు పోతిరెడ్డిపాడుకు ప్రవాహం తగ్గుతుందని, అప్పుడు తమ రాష్ట్ర మిగులు జలాల వినియోగానికి కేటాయించిన ఆయకట్టుకు నష్టం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రాజెక్టులో 812.5 అడుగులు ఉన్నప్పుడు 35.78 టీఎంసీల నీరు ఉంటుంది. డెడ్ స్టోరేజీ పూర్తిగా వాడేసుకుంటే తిరిగి ప్రాజెక్టులోకి నీరు చేరడానికి రెండు నెలలు పడుతుంది. కానీ, డెడ్ స్టోరేజీ 830 ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకే కాదు ఏపీకి చెందిన హంద్రినీవా, ముచ్చుమర్రి, కేసీ కెనాల్, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని తీసుకెళ్లవచ్చు. అప్పుడు ప్రాజెక్టు నిండడానికి 20 రోజులు సరిపోతుంది. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు అంచనా ప్రకారం పూర్తి నీటి నిల్వ 263 టీఎంసీలు. పూడిక వల్ల ప్రస్తుతం 215.8 టీఎంసీలే నిల్వ ఉంటున్నాయి. కనీసం 40 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీగా ఉండాలి.

అపెక్స్ కౌన్సిల్​ తీర్పు అమలయ్యేనా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా–గోదావరి జలాల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసింది. బోర్డుల సూచనలను ఏ రాష్ట్రం పాటించకపోవడంతో ఇకపై రెండు రాష్ట్రాలకు ఎలాంటి పరిష్కారం సూచించనని కృష్ణా బోర్డు అలిగింది. నీటి వినియోగపు లెక్కలు సేకరించడానికి మీటర్లు పెట్టాలన్న నిర్ణయం నేటికీ అమలు కాలేదు. ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకుంటుందో తెలుసుకునేందుకు బోర్డు దగ్గర సరైన లెక్కలు లేవు. బోర్డు మాత్రం కేటాయింపులు చేస్తూనే వుంది. గోదావరి నీటి వినియోగంపై బోర్డు నిర్ణయాలు అమలు జరగడం లేదని చైర్మన్ చెబుతున్నారు. అనుమతి లేకుండానే ప్రాజెక్ట్ నిర్మాణాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. చివరికి రెండు రాష్ట్రాలు నీటి తగాదా అపెక్స్ కౌన్సిల్​కు చేరింది. రెండుసార్లు కౌన్సిల్​ మీటింగ్​ వాయిదా పడినా.. చివరికి రెండు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల డీపీఆర్ లు ఇవ్వాలని ఆదేశించింది. డీపీఆర్​లు ఇచ్చిన తరువాత అపెక్స్ కౌన్సిల్​ అనుమతించే వరకు ఎలాంటి ప్రాజెక్ట్ లు నిర్మించవద్దని స్పష్టం చేసింది. అయినా దీనికి భిన్నంగా ఏపీలో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

– సారంపల్లి మల్లారెడ్డి,  ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ సభ

For More News..

జాతీయవాదమంటే మతవాదమా?

కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్

కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌