Srisailam: ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద తాకిడి.. శ్రీశైలంలో పెరిగిన కరెంట్ ఉత్పత్తి

  • రోజుకు 21 మిలియన్ యూనిట్లు జనరేట్
  • ఎగువన కురుస్తున్న వర్షాలతో పెరిగిన వరద తాకిడి

హైదరాబాద్, వెలుగు: ఆల్మట్టి డ్యామ్ నుంచి వరద తాకిడి పెరగడంతో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో శ్రీశైలం ఎడమగట్టున ఉన్న హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రోజుకు 75వేల క్కూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా కిందికి వదులుతున్నారు. దీంతో డెయిలీ 21 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. గడిచిన 21 రోజుల్లో 140.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. కాగా, రాష్ట్రానికి 2,440 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రధానంగా 900 మెగావాట్ల సామర్థ్యం శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్ నుంచి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఆరు ప్లాంట్ల నుంచి రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. 234 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అప్పర్ జూరాల నుంచి 2.50 మిలియన్ యూనిట్లు, 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్ జూరాల నుంచి 3.12 మిలియన్ యూనిట్లు, 815 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్ నుంచి 1.23 మిలియన్ యూనిట్లు జనరేట్ అవుతున్నది.

 

జులై ఫస్ట్ వీక్ నుంచి విద్యుత్ ఉత్పత్తి


జులై మొదటి వారం నుంచే జల విద్యుత్ ఉత్పత్తి షురూ అయింది. ప్రారంభంలో రోజుకు మిలియన్ యూనిట్ల కరెంట్ కూడా జనరేట్ అయ్యేది కాదు. 16వ తేదీ నుంచి ఉత్పత్తి జోరందుకున్నది. జులై 24 వరకు 10 మిలియన్ యూనిట్లలోపు పవర్ ప్రొడక్షన్ అయింది. 25వ తేదీ నుంచి భారీగా పెరిగింది. రోజుకు సగటున 23 మిలియన్ యూనిట్ల కరెంట్ జనరేట్ అయింది. 25న 23.21 మిలియన్ యూనిట్లు, 26న 22.25 మిలియన్ యూనిట్లు, 27న 21.23 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది. గడిచిన 21 రోజుల్లో 140.73 మిలియన్ యూనిట్ల పవర్ జనరేట్ అయింది. 25వ తేదీ నుంచి రోజుకు సగటున 75వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. ఏప్రిల్ ఫస్ట్ నుంచి మే నెలాఖరు దాకా 10.10 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి జరిగింది. జూన్​లో కనీసం మిలియన్ యూనిట్ల కరెంట్ కూడా జనరేట్ కాలేదు. జులై 27 నాటికి 140.73 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 150.85 మిలియన్ యూనిట్లు జనరేట్ అయింది.