- మిగిలింది 40 టీఎంసీలే.. తాగునీటి కష్టాలు తప్పవా?
- కల్వకుర్తి ఆయకట్టుకు నీళ్లివ్వలేమన్న ఆఫీసర్లు
నాగర్ కర్నూల్, వెలుగు : శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతున్నది. పదేండ్లలో ఎన్నడూ లేనట్టు ఫిబ్రవరిలోనే డెడ్ స్టోరేజీకి అడుగు దూరంలో ఉంది. రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటి మట్టం 819 అడుగులకు చేరుకోగా.. 40 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు కాగా.. మిగిలిన 10 టీఎంసీల్లోనే అన్ని అవసరాలకు సరిపెట్టాల్సిఉంటుంది. ఐదు నెలల పాటు ఆవిరి నష్టాలు(రోజుకు 158క్యూసెక్కులు) పోగా మిగిలిన నీటి నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు, మూడువేల గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తమ వాటా కోసం పట్టుబడుతున్నది. ముచ్చుమర్రి నుంచి రోజు 960 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో తాగునీటి గండం పొంచి ఉంది.
ఈసారి ప్రాజెక్టులో చేరింది 101టీఎంసీలే..
ఈ యేడు శ్రీశైలంలోకి అతి తక్కువగా 101 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. ఇందులో 21 టీఎంసీలతో జల విద్యుత్ ఉత్పత్తి చేసి.. టీఎస్ పవర్ జనరేషన్ స్టేషన్ద్వారా సాగర్‌కు వదిలారు. వానాకాలం సీజన్లో పంటల కోసం కేఎల్ఐ కింద 14 టీఎంసీలు, మిషన్ భగీరథకు 9 టీఎంసీలు వినియోగించారు. ఏపీ ప్రభుత్వం తన వాటా నీటిని వాడుకోగా ప్రస్తుతం నీటి నిల్వ40 టీఎంసీలకు చేరుకుంది. 2022లో శ్రీశైలం రిజర్వాయర్‌లోకి రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. దాదాపు 636 టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించి కిందికి వదిలేశాయి. సాగర్, కల్వకుర్తి స్కీంలకు దాదాపు 180 టీఎంసీలు వాడుకున్నట్టు కేఆర్ఎంబీ రికార్డుల్లో పేర్కొన్నారు. కృష్ణానదికి అవతలి వైపు ఏపీ సర్కార్ టెలీమెట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో సాగర్, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హెచ్ఎన్ఎస్ఎస్ద్వారా వాడుకున్న నీళ్లకు లెక్కా పత్రం లేకుండాపోయింది. కల్వకుర్తికి 45 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికి 22 టీఎంసీలకు మించి వాడుకోలేకపోయారు. పాలమూరు జిల్లాలోని నెట్టెంపాడుకు 20 టీఎంసీలు కేటాయించినా ర్యాలంపాడు రిజర్వాయర్‌కు బుంగ పడడంతో నీటిని నిల్వ చేయలేకపోయారు. భీమాకు 20 టీఎంసీలు కేటాయించినా 10 టీఎంసీలే వాడుకోగలిగారు.
తాగునీటి కష్టాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీలు అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న నిల్వలో ఆవిరి నష్టాలు, ఏపీ తరలించుకోగా మిగిలే నీటితో ఎండాకాలం ఎలా నెట్టుకురావాలో తెలియక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. కేఎల్ఐ కింద ఎల్లూరు రిజర్వాయర్‌నుంచి ఎల్లూరు వాటర్ గ్రిడ్ కు, గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్ పహడ్, కమ్మదనం, రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని సప్లై చేస్తారు. అక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని 19మున్సిపాలిటీలు, 3008 గ్రామాలకు వేసవి ముగిసేవరకు తాగునీటి సరఫరా చేయాలి. ఇప్పుడున్న నిల్వలతో వానాకాలం వచ్చేదాకా తాగునీరు సప్లై చేయడం కష్టమేనని మిషన్ భగీరథ ఆఫీసర్లు చెప్తున్నారు. అందువల్ల శ్రీశైలం నుంచి భగీరథ అవసరాలకు వాడుకుంటూనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తితే స్థానిక బోర్లను వినియోగించుకునేలా ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్లు కేటాయించింది.
యాసంగికి సాగునీరు బంద్
నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కేఎల్ఐ కింద యాసంగి సాగుకు నీరివ్వలేమని ఆఫీసర్లు తేల్చేశారు. అక్టోబర్‌లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎల్ఐ మోటార్లు బంద్ పెట్టి కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసింది. ఈ ప్రాంతంలో యాసంగిలో 2.20 లక్షల ఎకరాల్లో పంటలు వేసేవారు. ప్రస్తుతం బోరుబావుల కిందే పల్లీ,వరి సాగు చేస్తున్నారు. నీటి ఆధారం లేని రైతులు పొలాలను పశువుల మేతకు వదులుకున్నారు.