- 19 రోజుల హుండీ ఆదాయం రూ.కోటి 96 లక్షలు
కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కరోనా ఆంక్షల నేపధ్యంలో భక్తుల రాకపోకలను పరిమితం చేసినా భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించే కానుకలు ఏమాత్రం తగ్గడం లేదు. గత 1 రోజుల హుండీ కలెక్షన్ ను మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సీసీ కెమెరాల నిఘా.. పటిష్ఠ భద్రత నడుమ ఆలయ సిబ్బందితోపాటు పలువురు శివసేవకులు, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. గత 19 రోజులకు గాను రూ. 1 కోటి 96 లక్షల 05 వేల 93 రూపాయలు (కోటి తొంభై ఆరులక్షల ఐదు వేల తొంభై మూడు) నగదును భక్తులు కానుకగా సమర్పించారు. అలాగే వీటితోపాటు 282.4 గ్రాముల బంగారం, 9.3 కిలోల వెండి ఆభరణాలు, 54 అమెరికా డాలర్లు (యూఎస్ఏ), 02 సింగపూర్ డాలర్లు, 20 ఇంగాండ్ ఫౌండ్లు, 7 ఓమన్ రియాల్స్, 10 ఫ్రాన్స్ సూసిస్ కరెన్సీ కూడా హుండీలో భక్తులు సమర్పించారని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా తమ ఆడపడుచు అయిన శ్రీ భ్రమరాంబ దేవికి మొక్కుబడులు చెల్లించేందుకు కర్నాటక, మహారాష్ట్రల నుండి వేలాది మంది భక్తులు భారీ సంఖ్యలో శ్రీశైలానికి రానున్న నేపధ్యంలో హుండీని క్లియర్ చేశామని.. అలాగే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి బాగా పెరిగిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని.. భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.