హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ను వైద్యులు విడుదల చేశారు. గత రెండు రోజుల నుంచి శ్రీతేజ్‌కి మళ్లీ ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుందని వైద్యులు తెలిపారు. అతనికి ఆదివారం నుంచి ప్రసరణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రోపిక్ సపోర్ట్ కూడా అవసరమైందని చెప్పారు.
PCR నివేదిక ప్రకారం, అతని యాంటీబయాటిక్స్ శనివారం నుంచి మార్చామని, అతనికి ఎటువంటి జ్వరం లేదని, అతని నాడీ సంబంధిత స్థితి యథాతథంగా ఉందని వైద్యులు తెలిపారు. పైప్ ద్వారానే శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామని, ఎడమ వైపు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తగ్గిందని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు.
డిసెంబర్ 4న పుష్ప2 బెనిఫిట్షో సందర్భంగా పోలీసులు పర్మిషన్ఇవ్వకున్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లగా.. అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె తొమ్మిదేండ్ల కొడుకు శ్రీతేజ్కోమాలోకి వెళ్లాడు.
అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్తప్పుపట్టారు. దీనికి తోడు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను విచారణకు పిలిచి.. ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో ఆయన తన తప్పును ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అర్జున్ తండ్రి అల్లు అరవింద్, చిత్ర నిర్మాతలు శ్రీతేజ్దగ్గరికి వెళ్లారు. రేవతి కుటుంబానికి సాయంగా రూ.2 కోట్ల చెక్కును అందజేశారు.
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను డిసెంబర్ 13న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్పై మరుసటిరోజు (14న) చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్కు ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కట్టి సంఘీభావం ప్రకటించారు. కానీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఆవైపు పెద్దగా ఎవరూ వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.