అక్టోబరు 4 నుండి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు వెల్లడించారు. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని ఈవో తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, జిల్లాయంత్రాంగం సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో, జేఈవోలు, టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో ఈవో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు.

Also Read :- 25 పబ్బులపై ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు

బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు

  • ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు. 
  • గరుడ వాహనసేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం.
  • భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.
  • ⁠వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు.
  • అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు.
  • అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకల రద్దు.
  • శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం.

ఇదిలావుంటే,  శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కనుక తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.