- గతంలో ఇరిగేషన్ శాఖ సేకరించిన భూములకు పట్టాలు
- ధరణి వచ్చాక పాత ఓనర్ పేరుతో కొత్త పాస్ బుక్స్
- తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో వెలుగులోకి..
- కొత్తపల్లి, హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ ఎస్సారెస్పీ భూములు అన్యాక్రాంతం
కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. రెవెన్యూ ఆఫీసర్ల అవినీతి, నిర్లక్ష్యంగా కారణంగా కొన్ని చోట్ల ఇరిగేషన్ భూములకు ఏకంగా పట్టాదారు పాస్‌బుక్స్ మంజూరవుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల్లో లోపాలను ఆసరాగా చేసుకుని ఓ పాత పట్టాదారు కొత్త పాస్‌బుక్స్ తీసుకోవడం, దాని ఆధారంగా భూమిని మరొకరికి అమ్మేసిన ఘటన తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనూ ఎస్సారెస్పీ బూములు అన్యాక్రాంతమవుతున్నా ఆ శాఖ ఆఫీసర్లు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇండ్ల స్థలాలను వ్యవసాయ భూమిగా మార్చేసిన్రు
ముప్పై ఐదు ఏండ్ల కింద నిర్మించిన ఎల్ఎండీ ప్రాజెక్ట్‌లో పాత నుస్తులాపూర్ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. డ్యాం నిర్మాణానికి ముందు గ్రామంలోని సర్వే నంబర్ 1111/A/1, 1111/A/2, 1111/B/1/1, 1111/B/1/2 సర్వే నంబర్లలోని 2.20 ఎకరాల భూమిని పట్టాదారు మహ్మద్ ఖాజా మోహినొద్దీన్ నుంచి గ్రామానికి చెందిన దుర్శెట్టి కనకయ్య, శ్రీనివాస్, రాజు, కొమురయ్య, సంపత్, ఎల్లయ్య, కొమురయ్య, జగన్, మల్లయ్య, లక్ష్మణ్‌లు సాదాబైనామా పద్ధతిలో కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నారు. తర్వాత ఎల్‌ఎండీ నిర్మించడంతో రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నప్పుడు ఇండ్లు, ఖాళీ స్థలాలు ముంపునకు గురయ్యేవి. దీంతో 1994లో అప్పటి ప్రభుత్వం 37 ఇండ్లకు నష్టపరిహారం చెల్లించింది. దీంతో వారు ఇండ్లు ఖాళీ చేశారు. తర్వాత ఆ ఇండ్లు కూలిపోయాయి. డ్యాంలో నీళ్లు తగ్గి భూములు తేలినప్పుడల్లా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
భూ రికార్డుల ప్రక్షాళనలో పాత ఓనర్‌కు పట్టాదార్ పాస్‌బుక్స్
ఎల్‌ఎండీలో ముంపునకు గురైన 1111 సర్వే నంబర్‌లోని ఇండ్లకు ఇంటినంబర్ల పేరిటే పరిహారం చెల్లించారు. దీంతో ఆ సర్వే నంబర్‌లోని భూమి రెవెన్యూ రికార్డుల్లో, పహాణీల్లో పాత యజమాని పేరుతోనే ఉంది. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన చేపట్టడంతో పాత ఓనర్ మహ్మద్ ఖాజా మోహిన్‌ద్దీన్ పేరిట పాస్‌బుక్స్ జారీ అయ్యాయి. దీంతో అతడు ధరణి ద్వారా రామకృష్ణకాలనీకి చెందిన ఓ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల మోఖా మీదికి రావడంతో పాటు తన భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని అప్లై చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న సదరు వ్యక్తులు తమకు సాదాబైనామా కింద అమ్మిన పట్టాదారే.. మళ్లీ ఇంకొకరికి ఆ భూమి అమ్మాడని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి భూమిని రక్షించాలని కోరారు.
ఇతర ప్రాంతాల్లోనూ కబ్జాలు..
జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఎస్సారెస్పీ భూముల ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి శివారులో 243, 246, 247, 325, 328, 326, 327 సర్వే నంబర్ల మీదుగా ఎస్సారెస్పీ కాలువ వెళ్లింది. కాల్వకు ఇరువైపులా ఉన్న ఎస్సారెస్పీ భూములను ఆక్రమించుకుని షెడ్లు వేసుకోవడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే రెండు, మూడు అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా అటు ఎస్సారెస్పీ, ఇటు మున్సిపల్ పట్టించుకోక పోగా ఇంటి నంబర్లు సైతం కేటాయిస్తున్నారు. కాల్వ పక్కనే కరీంనగర్ మెయిన్ రోడ్డు నుంచి ఇప్పల నర్సింగాపూర్ వరకు ఎస్సారెస్పీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో 531 సర్వే నంబర్‌లో భూమి కొనుగోలు చేసిన ఓ ప్రజాప్రతినిధి.. పక్కనే ఉన్న ఎస్సారెస్పీ ల్యాండ్‌ను ఆక్రమించుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగాధర మండలం ఒద్యారం గ్రామంలో సర్వే నంబర్ 147/C/1/2, 147/C/2/2లో ఉన్న 12 గుంటల స్థలంలో ఇటీవల కొందరు వ్యక్తులు మొక్కలు నాటి కబ్జా చేసేందుకు యత్నించారు.