నారుమళ్లకు ఎస్సారెస్పీ నీళ్లే!

నారుమళ్లకు ఎస్సారెస్పీ నీళ్లే!

జూన్ లో ఒక తడి ఇచ్చేందుకు ప్లాన్

జూలై నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీళ్లు

ప్రాణహితలో ప్రవాహం మొదలయ్యాకే కాళేశ్వరం ఎత్తిపోతలు

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీరాంసాగర్‌‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీరిచ్చేందుకు ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్లాన్​ రెడీ చేస్తోంది. ప్రాణహితలో వరద మొదలయ్యాకే కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభించాలని, అప్పటివరకు ఎస్సారెస్పీలోని నీళ్లనే నారు మళ్లకు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌‌ ఆదేశించడంతో ప్రణాళిక రెడీ చేస్తోంది. తొలుత రోహిణి కార్తెలోనే నీళ్లివ్వాలనుకున్నా ఎండలు ఎక్కువగా ఉండటంతో మృగశిరలో (జూన్‌‌లో) ఒక తడి ఇచ్చే అవకాశముంది. జులై నుంచి ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఆన్‌‌ ఆఫ్‌‌ పద్ధతిలో నీళ్లు విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఎస్సారెస్పీలో 30 టీఎంసీల నీళ్లు

ఎస్సారెస్పీలో 29.90 టీఎంసీల నీళ్లున్నాయి. ఇందులో తాగునీటికి 10 టీఎంసీలు, కనీస నీటి మట్టం కింద ఐదారు టీఎంసీలను మినహాయించి మిగతా 14 టీఎంసీలను స్టేజ్‌‌-1, స్టేజ్‌‌-2 ఆయకట్టుకు ఇచ్చేందుకు ఇప్పటికే ప్లాన్‌‌ రెడీ చేశారు. గోదావరి నీటి వాడకంపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం కేసీఆర్‌‌ కూడా ఎస్సారెస్పీలోని నీటిని ప్లాన్‌‌ ప్రకారం ఆయకట్టుకు విడుదల చేయాలని సూచించారు. ఈ మేరకు ఇరిగేషన్‌‌ శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ రజత్‌‌కుమార్‌‌ ఇంజనీర్లతో ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించారు.

జూలై చివరి నాటికి 3 తడులు

ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలు కాగా స్టేజీ -1 కింద 9.50 లక్షల ఎకరాలు, స్టేజీ -2 కింద 3.50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలంలో నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు గుత్పా, అలీసాగర్‌‌ కింద 40 వేల ఎకరాలు, కడెం కింద 40 వేల ఎకరాలు, మిడ్‌‌ మానేరు ఆయకట్టు 30 వేల ఎకరాలు, సదర్మాట్, గౌరవెల్లి కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వనున్నారు. వీటితో పాటు ఎస్సారెస్పీ కింద 900 చెరువులు, వరద కాలువ కింద 49 చెరువులు నింపనున్నారు. ఎస్సారెస్పీలో ఉన్న నీటితో జూలై చివరి నాటికి మూడు తడులు అందించవచ్చని లెక్కగట్టారు.

నాట్లు పడ్డాక నీళ్ల వాడకం తగ్గుతుందని..

రైతులు నార్లు పోసుకునేందుకు వీలుగా జూన్‌‌ 15 తర్వాత ఒక తడి ఇవ్వనున్నారు. జులై మొదటి వారంలో ఒక తడి, మూడో వారంలో రెండో తడి ఇచ్చి బావుల కింద నార్లు పోసుకునే రైతులు నాట్లేసుకునేలా ప్రోత్సహించనున్నారు. ఒకసారి నాట్లు పూర్తయితే నీటి వాడకం బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటికే ఎగువన చత్తీస్‌‌గఢ్‌‌లో వానలు పడి ప్రాణహితలో వరద పెరుగుతుందని గత అనుభవాలు చెప్తున్నాయి. వరద మొదలవగానే మేడిగడ్డ బ్యారేజీ గేట్లు దించి వచ్చే నీటినంతా నిల్వ చేయనున్నారు. రోజుకు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఏర్పడగానే కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు మొదలు పెట్టనున్నారు. వరద పరిస్థితిని బట్టి రెండు టీఎంసీలకు పెంచున్నారు. అప్పటికీ ఎస్సారెస్పీకి వరద రాకపోతే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే నీళ్లలో ఒక టీఎంసీని ఎస్సారెస్పీ పునరుజ్జీవానికి, ఇంకో టీఎంసీని మిడ్‌‌ మానేరు ద్వారా ఎల్‌‌ఎండీ కింది ఆయకట్టుకు ఇచ్చేలా ప్లాన్‌‌ రూపొందించారు.

జూన్‌‌ 2 నుంచి రంగనాయక సాగర్‌‌ ఎత్తిపోతలు

మిడ్‌‌ మానేరులో 17 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉండటంతో ఆ నీటిని రంగనాయకసాగర్‌‌ వరకు లిఫ్ట్‌‌ చేయాలని నిర్ణయించారు. జూన్‌‌ 2న రంగనాయకసాగర్‌‌ ఎత్తిపోతలను సీఎం అధికారికంగా ప్రారంభిస్తారని, అప్పటి వరకు మర్కుక్‌‌ పంపు హౌస్‌‌ సర్జ్‌‌పూల్‌‌లో నీటిని నిల్వ చేసి సిద్ధంగా ఉంచుతామని అధికారులు అంటున్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలకు ఆలస్యమైతే మిడ్‌‌ మానేరులో ఉన్న నీళ్లను ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై నాటికి ప్రాణహితలో రోజుకు 30 వేల క్యూసెక్కులపైగానే వరద ఉంటుందని, ఆ నీటితో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా ఉండదని ఇంజనీర్లు చెప్తున్నారు.

For More News..

బంగారం రేటు ఎందుకు పెరిగిందంటే..