ఎస్​ఎస్​ఏ ఉద్యోగుల పోరుబాట .. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి

  • కనీస వేతన చట్టం అమలు చేయాలి
  • డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న దీక్షలు 
  • స్పందించకుంటే 11 తర్వాత సమ్మెకు వెళ్తామని సర్కారుకు అల్టిమేటం 
  • రెగ్యులరైజేషన్ పై కేసీఆర్  గతంలో హామీ ఇచ్చి మరిచారని ఫైర్

జగిత్యాల/మంచిర్యాల, వెలుగు : విద్యా శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్ఎస్ఏ) కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. 16 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న తమను రెగ్యులరైజ్​​చేయాలని, మినిమమ్​పేస్కేల్  అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రోడ్డెక్కారు. రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈనెల 4 నుంచి తమ విధులను బహిష్కరించి అన్ని జిల్లా కేంద్రాల్లో రోజుకో రీతిలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లకు స్పందించకుంటే ఈనెల 11 తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని సర్కారుకు అల్టిమేటం జారీచేశారు. ఆందోళనలు ప్రారంభించి నేటికి ఏడు రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమను రెగ్యులరైజ్​ చేస్తామని సీఎం కేసీఆర్​ గతంలో హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శిస్తున్నారు. ఏపీ, ఒడిశా, మహారాష్ర్ట తదితర రాష్ర్టాలు అక్కడి ఉద్యోగులను రెగ్యులరైజ్​చేసి ఉద్యోగ భద్రత కల్పించాయని తెలిపారు. 

రాష్ర్టవ్యాప్తంగా 22 వేల మంది 

సమగ్ర శిక్షా అభియాన్ లో రాష్ర్టవ్యాప్తంగా సుమారు 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా 2005లో ఎస్ఎస్ఏను ప్రవేశపెట్టగా 2012లో సమగ్ర శిక్షగా మార్చారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలయ్యే ఈ స్కీమ్​ ద్వారా 2006 నుంచి దశలవారిగా కాంట్రాక్ట్​ బేసిక్​లో నియామకాలు చేపట్టారు. జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్​ అనలిస్టులు, టెక్నికల్​ పర్సన్లు, ఆపరేటర్లు, డీఎల్​ఎంటీలు, మెసేంజర్లు, మండల లెవెల్​లో డేటా ఎంట్రీ ఆపర్లు, ఎంఐఎస్​ కోఆర్డినేటర్లు, ఐఈఆర్​పీలు, మెసేంజర్లు, స్కూల్​ కాంప్లెక్స్​ స్థాయిలో క్లస్టర్​ రిసోర్స్​పర్సన్లు, స్కూల్​ స్థాయిలో పార్ట్​ టైమ్​ఇన్​స్ర్టక్టర్లు (ఆర్ట్, పీఈటీ, వర్క్​ఎడ్యుకేషన్), కేజీబీవీలు, యూఆర్ఎస్ లలో స్పెషల్​ ఆఫీసర్లు, పీజీఆర్​టీలు, సీఆర్​టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, క్రాఫ్ట్​ అండ్​ కంప్యూటర్​ ఇస్ర్టక్టర్లు, వాచ్​విమెన్​, కుక్స్, స్వీపర్లు, స్కావెంజర్లను నియమించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్  కింద రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్  రిజర్వేషన్ ఆధారంగా కాంట్రాక్ట్  ఉద్యోగులను ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ గవర్నమెంట్​ఎస్ఎస్ఏ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేసింది. నాలుగేండ్లుగా సర్కారు ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచింది ఏపీ. వాటితో పాటు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా, జీవిత బీమా, హెల్త్  ఇన్సూరెన్స్  కూడా కల్పించింది. పీఆర్​సీతో సంబంధం లేకుండా ఏటా రూ.వెయ్యి పెంపును అమలు చేస్తోంది. ఒడిశా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేశారు.  

4 నుంచి కొనసాగుతున్న నిరసన దీక్షలు  

తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్​ జాయింట్  యాక్షన్  కమిటీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్కూల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేన, చీఫ్  సెక్రటరీ వాకాటి కరుణ, ఎడ్యుకేషన్​ మినిస్టర్ సబితా రెడ్డికి సమ్మె నోటీసులు అందజేశారు. రెగ్యులరైజేషన్, మినిమమ్​ పేస్కేల్, జాబ్ సెక్యూరిటీ, రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల హెల్త్​ ఇన్సూరెన్స్​, విద్యాశాఖ నియామకాల్లో 30 శాతం వెయిటేజీ, మహిళా ఉద్యోగులకు 180 రోజులు మెటర్నిటీ లీవ్, దివ్యాంగులకు స్పెషల్​ అలవెన్సులు అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రెగ్యులరైజ్​ చేయాలి

రాష్ర్టవ్యాప్తంగా 22 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నారు. వారి అర్హతలను బట్టి రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు కల్పించినా రాష్ట్ర సర్కారు కనీస వేతనాలు ఇవ్వడం లేదు. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలి. లేదంటే ఈనెల 11 తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తాం. 
- బర్ల నారాయణ, జేఏసీ జిల్లా ప్రెసిడెంట్, జగిత్యాల

చాలీచాలని జీతాలతో  సర్దుకుపోతున్నం

విద్యా శాఖలో గత 16 సంవత్సరాలుగా రెగ్యులర్​ ఎంప్లాయీస్​తో సమానంగా పనిచేస్తున్నాం. కొన్ని విభాగాల్లో రెగ్యులర్​ ఉద్యోగుల కన్నా ఎక్కువ గంటలు డ్యూటీలు చేస్తున్నాం. ఎన్నటికైనా జాబ్​ రెగ్యులర్​ అవుతుందన్న ఆశతో చాలీచాలని జీతాలతో సర్దుకుపోతున్నం. మా న్యాయమైన  డిమాండ్లను నెరవేర్చాలి.
- భారతి, జేఏసీ జిల్లా అధ్యక్షురాలు, మంచిర్యాల