
ఇంటర్ అర్హతతో కేంద్రంలో కొలువు సాధించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీజీఎల్ తర్వాత ఎక్కువ మంది రాసే పరీక్ష సీహెచ్‍ఎస్‍ఎల్. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పోటీ పడతారు. సిలబస్ కూడా విస్తృతంగా ఉంటుంది. ప్లాన్డ్‌గా ప్రిపేరయితే ఇంటర్‌తోనే కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర జాబ్‌లో ఎంటరయ్యే అవకాశం కల్పిస్తోంది. పే లెవెల్ - 2, 4 కింద వేతనాలు అందిస్తారు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం..
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మొదలైన పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తుంది.
ఎగ్జామ్ ప్యాటర్న్
మొదటి దశలో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాల్లో ఒక్కో దానిలో 25 ప్రశ్నలు, 50 మార్కులతో మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులతో ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలుంటాయి. ఈ పరీక్షకు ఒక గంట సమయం ఉంటుంది. అభ్యర్థి గుర్తించే ప్రతీ తప్పు సమాధానానికీ 0.5 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రెండో దశ డిస్క్రిప్టివ్ పరీక్షలో అభ్యర్థులు ఎస్సే, లెటర్, అప్లికేషన్, ప్రెసీ రైటింగ్ మొదలైనవి రాయాల్సి ఉంటుంది. మార్కులు 100. కాలవ్యవధి ఒక గంట. ఈ పరీక్షలను ఇంగ్లిష్ లేదా హిందీలో రాసుకోవచ్చు.
ప్రిపరేషన్ ప్లాన్
మొదటి దశలో నిర్వహించే ఆబ్జెక్టివ్ పరీక్షను మే నెలలో నిర్వహిస్తారు. అంటే దాదాపు మూడు నెలలకు పైగా సమయం ఉంది. ఇప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించినా సమయం సరిపోతుంది. సబ్జెక్టులపై అవగాహన లేని అభ్యర్థులు ఆప్టిట్యూడ్, రీజనింగ్‌లలోని అన్ని టాపిక్స్‌నూ 30- నుంచి 40 రోజులలో పూర్తి చేసుకోవాలి. ఇంగ్లిష్ గ్రామర్‌ను ప్రాక్టీస్ చేసి, ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ముఖ్యంగా స్టాండర్డ్ జీకేతో పాటు కరెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. అభ్యర్థులు సబ్జెక్టులపై తమకున్న అవగాహన ఆధారంగా సబ్జెక్టులవారీగా సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రతిరోజు నేర్చుకున్న టాపిక్స్‌పై ప్రీవియస్ పేపర్లో ఎలా క్వశ్చన్స్ అడిగారో చూసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు.
సిలబస్
షిఫ్టుల వారీగా నిర్వహించే పరీక్ష కాబట్టి అభ్యర్థులు ముందు రోజు రాసిన వారిని క్వశ్చన్స్ ఎలా అడిగారో తెలుసుకొని దాని ప్రకారం సిద్ధమైతే మంచి స్కోర్ పొందొచ్చు. ఎందుకంటే అన్ని షిప్టుల పేపర్లు బ్యాలెన్స్‌డ్‌గా, ఈక్వల్ ప్యాటర్న్, స్టాండర్డ్స్‌తో తయారు చేస్తారు కాబట్టి ముందు షిఫ్టుల్లో అడిగిన ప్రశ్నలకు రిలేటెడ్ ఏరియాస్ ను బాగా రివిజన్ చేయాలి. ప్రశ్నలన్నీ ఇంటర్ స్టాండర్డ్‌లో కన్‌ఫ్యూజన్ లేకుండా నేరుగానే ఇస్తారు.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: దీనిలో అర్థమెటిక్ టాపిక్స్ అయిన నంబర్ సిస్టమ్, పర్సంటేజి, ఏవరేజి, రేషియో, ఇంటరెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, అలిగేషన్, మెన్సురేషన్లతోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగొనామెట్రీల నుంచి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు.
జనరల్ ఇంటెలిజెన్స్: దీనిలో వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్ రీజనింగ్‌లో కోడింగ్- డీకోడింగ్, డైరెక్షన్స్, ఆల్ఫా- న్యూమరిక్ సిరీస్, సిలాజిజమ్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రమ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచీ, నాన్-వెర్బల్ రీజనింగ్‌లో అనాలజీ, క్లాసిఫికేషన్, పేపర్ ఫోల్డింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్: కాంప్రహెన్షన్, ఒకాబులరీ, గ్రామర్ ఆధారంగా ఉండే ప్రశ్నల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, వర్డ్ సబ్‌స్టిట్యూషన్, డైరెక్ట్- ఇన్‌డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్- అండ్ పాసివ్ వాయిస్, ఇడియమ్స్- ప్రేజెస్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా పరీక్షలో అడుగుతారు.
జనరల్ అవేర్‌నెస్: దీనిలోని ప్రశ్నలు కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డులు, పుస్తకాలు- రచయితల నుంచి ఉంటాయి.
చివరి తేదీ: మార్చి 7వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి.
ఎగ్జామ్: మే నెలలో పరీక్ష నిర్వహించనున్నారు.
వెబ్‌సైట్: www.ssc.nic.in
- వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్