రికార్డు స్థాయిలో పవర్​ జనరేషన్​

రికార్డు స్థాయిలో పవర్​ జనరేషన్​
  • ఎస్సారెస్పీలో లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి
  • వరుసగా ఇది ఐదోసారి 
  • ఈ యేడు 62.25 మిలియన్ యూనిట్ల పవర్ జనరేట్
  • రికార్డుస్థాయి కరెంట్​ ఉత్పత్తిపై రైతుల హర్షం

బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువ జల విద్యుత్తు కేంద్రంలో ఈయేడు లక్ష్యానికి మించి 62.25 మిలియన్​ యూనిట్లు ఉత్పత్తి అయింది. విద్యుత్తు కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ ద్వారా 9 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. ఈ కాలువ నీటి విడుదల సామర్థ్యం 9 వేల క్యూసెక్కులు కాగా, ఇప్పటివరకు 7 వేల క్యూసెక్కులకు మించి వదలలేదు. 

కాలువ నుంచి నీటిని దిగువకు వదిలినప్పుడే కరెంట్ జనరేట్ చేసే వీలుంది. నీటి విడుదల సామర్థ్యాన్ని బట్టి  పవర్ ఉత్పత్తి చేస్తారు. సోమవారం 5500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, 2, 3 యూనిట్ల ద్వారా 12.50 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. ఇలాగే కొనసాగితే నెలకు 3.46 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఈ వానకాలం సీజన్​లో ఎగువ గోదావరి నుంచి 285.51 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. అప్పటి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదలతో జల విద్యుత్తు కేంద్రంలో కరెంట్ జనరేట్ అవుతోంది.

 గత ఐదేండ్లుగా టార్గెట్ కు మించి కరెంట్ ఉత్పత్తి జరుగుతోందని లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం యాసంగి తడుల కోసం నీటి సరఫరా చేస్తుండడంతో నాలుగు రోజులకు ఒక మిలియన్ యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 25 నుంచి వివిధ కాలువల ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ఏప్రిల్ 10 వరకు కాకతీయ కెనాల్ ద్వారా చివరి తడుల కోసం నీటి సరఫరా చేస్తున్నారు. రికార్డు స్థాయిలో కరెంట్ ఉత్పత్తి జరుగుతున్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు, ఇటు ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వరద కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు, 80.50  టీఎంసీలు కాగా, సోమవారం సాయంత్రానికి నీటి మట్టం 1070.30 అడుగులు, 23.86 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఇదే సమయంలో ప్రాజెక్టులో 1065.20 అడుగుల నీటి మట్టం ఉండగా, 16.26 టీఎంల నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. లక్ష్మీ కాలువకు 250 క్యూసెక్కులు, అలీసాగర్ 463 క్యూసెక్కులు, గుత్ప 270, సరస్వతీ కెనాల్ కు 700 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. రోజుకు మిషన్ భగీరథ కు 231 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోందని ఆఫీసర్లు తెలిపారు.  537 కూసెక్కుల నీరు ఆవిరవుతోంది.

కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల చేయడంతో రికార్డు స్థాయిలో కరెంట్ఉత్పత్తి 

 ఏడాది    టార్గెట్    ఉత్పత్తి

                 (మిలియన్​యూనిట్లలో)

2020-21    50    90.76
2021-22    75    109.84
2022-23    75    138.92
2023-24    60    75.86
2024-25            62.25  
సోమవారం వరకు 62.25 మిలియన్​ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయినట్లు జెన్కో డీఈ శ్రీనివాస్ తెలిపారు.