చివరికి నీళ్ల కరువు .. ఆయకట్టు ఆఖరు భూములకు అందని ఎస్సారెస్పీ నీళ్లు

 చివరికి నీళ్ల కరువు .. ఆయకట్టు ఆఖరు భూములకు అందని ఎస్సారెస్పీ నీళ్లు
  • రూ.112 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం
  • ములుగు, భూపాలపల్లి జిల్లాల కాలువల్లోకి రాని గోదావరి 
  • సాగునీటికి రైతన్నల గోస

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 30 వేల ఎకరాలకు పైగా సాగునీరందించే డీబీఎం 38 ఎస్సారెస్పీ కాలువ ఇది. గత ప్రభుత్వ హయాంలో ఈ కాలువను రూ.112 కోట్లతో రిపేర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ ఏడాది యాసంగి సాగుకు సాగునీరందిస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో రైతులు మొక్కజొన్న, వరి పంట సాగు చేశారు. ఎస్సారెస్పీ నీళ్లు ఒదిలినా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా ఈ మండలానికి రాలేదు. ఇదే జిల్లాలోని రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి మండలాలకు కూడా సాగునీళ్లు రాక వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్ధితి వచ్చింది'

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి/ చిట్యాల, వెలుగు: వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాకు ఎస్సారెస్పీ వర ప్రదాయిని. మొదటిదశ కింద 3.57 లక్షలు, రెండో దశ కింద 1.13 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది లక్ష్యం. రెండో దశ పనులు పూర్తికాకపోవడంతో కొన్నేండ్లుగా తొలిదశ కాలువల కింద ఆయకట్టులో సాగుచేస్తున్న పంటలకు నీరందిస్తున్నారు. ఈ యాసంగిలో ఆయకట్టు చివరి వరకు ఎస్పారెస్పీ నీళ్లు అందక వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. కాల్వల ద్వారా నీళ్లు అందక చెరువులు ఎండిపోయాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలకు సాగునీరందించే డీబీఎం 38, 40 కాలువల్లో నీళ్లు రావట్లేదు. దీంతో ఈ రెండు జిల్లాలలో వేసిన పంటల పరిస్థితి ప్రమాదంలో పడ్డాయి. ఇంకో వారం గడిస్తే వరి, మొక్కజొన్న పంటలు పశువుల మేతకు తప్ప చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రూ.112 కోట్లతో మరమ్మతులు చేసినా ఫలితం శూన్యం

వరంగల్‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో డీబీఎం 38 కింద 78,614, డీబీఎం 40 కింద 34,877 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల కిందనే ఈ కాల్వలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 31.6 కి.మీ, రేగొండ మండలంలో 25 కి.మీ, గణపురం మండలంలో 7.5 కి.మీ దూరం ఎస్సారెస్పీ డీబీఎం 38 కాల్వలు తవ్వారు. వీటి కింద 62 వేల ఎకరాలకు సాగునీరందించాలి. అయితే ఈ కాల్వలు శిథిలమవ్వడంతో గత ప్రభుత్వం రూ.112 కోట్లతో మరమ్మతులు చేసింది. 

ఇప్పడు కారణం తెలియదు కానీ నెల రోజులకు పైగా ఎస్సారెస్పీ నీళ్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా భూపాలపల్లి, ములుగు జిల్లాలకు నీళ్లు అందడం లేదు. ఎస్సారెస్పీ కాల్వల ఆయకట్టు చివరిలో ఉండటంతో నీళ్లు రావట్లేదని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో గోదావరి నీళ్లపై ఆశతో పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వ్యవసాయ బావులు, వాగుల నీటి ఆధారంగా పంటలను కాపాడుకుంటూ వచ్చారు. మరో వారం రోజులు గడిస్తే ఎస్పారెస్పీ నీళ్లు రాకపోతే ఈ రెండు  జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని రైతులు చెబుతున్నారు. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం స్పందించి సాగునీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.

వరి ఎండిపోతోంది..

మూడు ఎకరాలలో వరి సాగుచేసిన. పొట్ట దశలో ఉన్నది. నీళ్లు లేక ఎండిపోతోంది. చలి వాగులో  నీటిధారం బందైంది. భూగర్భ జలాలు లేక బోర్లు, బావులు ఎండిపోయినయ్‌‌‌‌‌‌‌‌. ఇప్పటికే దాదాపు లక్ష పెట్టుబడి అయింది. ఇంకో వారం రోజులలో ఎస్సారెస్పీ నీళ్లు అందియ్యకపోతే చలివాగు వెంబడి సాగుచేసిన దాదాపు 400 ఎకరాల వరి పంట ఎండిపోయే ప్రమాదముంది. ఎస్సారెస్పీ జలాలు అందించి రైతులను ఆదుకోవాలె.

గొల్ల కబీర్, మేదరమెట్ల గ్రామ రైతు, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా