- జీడిమెట్ల ఎస్ఎస్ వీ ఫ్యాబ్ఇండస్ట్రీలో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ఇంత వరకు కేసు ఫైల్చేయకపోవడంపై అనేక అనుమానాలు
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ఏరియాలోని ఎస్ఎస్ వీ ఫ్యాబ్ ఇండస్ట్రీ తగలబడుతూనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ మంటలు చల్లార లేదు. మూడో రోజైన గురువారం కూడా ఎగిసి పడ్డాయి. నల్లటి దట్టమైన పొగతో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. గురువారం ఆరు ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేశారు.
జేసీబీల సాయంతో కూలిన బిల్డింగ్శిథిలాలను తొలగిస్తున్నారు. దట్టమైన పొగ, నిప్పు సెగతో స్థానికంగా తీవ్ర వాయుకాలుష్యం ఏర్పడుతోంది. కండ్ల మంటలు, శ్వాస సంబంధిత సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీని ఆనుకుని ఉన్న అపురూపకాలనీ, ఎస్ఆర్ నాయక్నగర్ కాలనీలకు చెందిన వందల కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పూర్తిగా ఆర్పేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. కాగా ఎస్ఎస్ వీ ఫ్యాబ్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగి మూడోరోజులు దాటినా ఇంతవరకు కంపెనీపై ఎలాంటి నమోదు చేయలేదు. చిన్నపాటి ప్రమాదాలపై కేసులు నమోదు చేసే పోలీసులు, ఇంత పెద్ద అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేయకపోవడం ఏమిటని ఇండస్ట్రియల్ఎస్టేట్లో చర్చ జరుగుతోంది. దట్టమైన పొగ కారణంగా గురువారం నర్సాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్స్తంభించింది. నేషనల్హైవే వరకు నిలిచింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.