శివ్వంపేట లో ఎస్టీ హాస్టల్ ​నిండా సమస్యలే

శివ్వంపేట లో ఎస్టీ హాస్టల్ ​నిండా సమస్యలే

మెదక్ ​జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఎలాంటి మెయింటెన్స్ చేయడం లేదు. హాస్టల్​లోని బాత్రూమ్​లకు డోర్లు ఊడిపోయాయి. ట్యాప్​లు లేవు. స్టూడెంట్లే డోర్లను అడ్డుగా పెట్టుకుని మల, మూత్ర విసర్జనకు వెళ్తున్నారు. చలికి వణుకుతూనే ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. ఎలాంటి వాటర్​హీటర్లు లేవు. హాస్టల్​లోని మినరల్​వాటర్​ప్లాంట్ చెడిపోయి రెండేళ్లు అవుతోంది. ఫండ్స్​లేక ఇప్పటి వరకు రిపేర్​చేయించలేదు. చేసేదేం లేక చిన్నారులు నల్లా నీళ్లనే తాగుతున్నారు. 

గతేడాది అక్టోబర్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిన బ్లాంకెట్లు ఇంతవరకు అందలేదు. స్టూడెంట్లు పాత వాటినే వాడుకుంటున్నారు. హాస్టల్ ​బిల్డింగ్ ​చుట్టూ కాంపౌండ్​ వాల్​ లేదు. దీంతో పక్కనే ఉన్న పంచాయతీ వాటర్ ట్యాంక్ నుంచి లీకైన నీరు నేరుగా హాస్టల్​ ఆవరణలోకి చేరుతోంది. డెయిలీ పందులు, కుక్కలు, గేదెలు వచ్చి వాటిలో పొర్లుతున్నాయి. మురుగు నీరు దోమలు, ఈగల ఆవాసంగా మారింది. 

ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు రిలీజ్​చేయాలని, హాస్టల్​లో రిపేర్లు చేయించాలని స్టూడెంట్లు కోరుతున్నారు.  చిన్నారుల ఇబ్బందులు చూడలేక వార్డెన్ ​గతేడాది సొంత ఖర్చుతో ఫ్యాన్లను రిపేర్ ​చేయించారు. బల్బులు తెప్పించి అమర్చారు. ఇక్కడ మొత్తం 180 మంది ఎస్టీ స్టూడెంట్లు ఉంటున్నారు. స్థానిక స్కూల్​లో చదువుకుంటున్నారు. 

వెలుగు, శివ్వంపేట