
చికాగోలో ప్రతి ఏటా సెయింట్ పాట్రిక్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా వేడుకలు జరిగాయి. అయితే ఆ వేడుకల్లో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. నది ఆకుపచ్చ రంగులో కనిపించడం. ఈ సెలబ్రేషన్స్‌లో ఆకుపచ్చగా ఉన్న నదే హైలైట్. దాని వెనక కథేంటో తెలుసుకుందాం.
సెయింట్ పాట్రిక్స్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్కడ ప్రవహించే నదిలో ఆకుపచ్చని రంగు చల్లుతారు. దాంతో నది మొత్తం ఆకుపచ్చగా మెరిసిపోతుంది. ఈ సంప్రదాయం1962లో మొదలైంది. చికాగో నగర కార్మికులు డౌన్‌టౌన్ గుండా ప్రవహించే నదిలో100 పౌండ్ల రంగును చల్లారు. అది వారం పాటు ఆకుపచ్చగా కనులవిందు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా సెయింట్ పాట్రిక్స్ డే సందర్భంగా నదిలో ఆకుపచ్చ రంగు చల్లడం సంప్రదాయంగా మారింది.
కొన్ని రికార్డుల ప్రకారం, చికాగో వ్యర్థాలకు కేరాఫ్‌గా ఉన్న నది తీర ప్రాంతాలను క్లీన్ చేసే ప్రయత్నాల్లో ఈ ఆకుపచ్చ రంగు కూడా ఒకటిగా ఉంది. 1955లో రిచర్డ్ జె. డేలీ చికాగో మేయర్ కాగానే ఆయన నదీ తీరాన్ని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో మురుగు నీరు ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టే పనిని నగర కార్మికులకు అప్పగించారు. వ్యర్థాల మూలాలను గుర్తించడంలో సాయపడడానికి ఆకుపచ్చ రంగును ఉపయోగించారు. సెయింట్ పాట్రిక్స్ డే జరుపుకోవడానికి మిచిగాన్ సరస్సులోని కొంత భాగాన్ని ఆకుపచ్చ రంగులో వేయాలని డేలీ అనుకున్నారు. కానీ, చికాగో నదికి రంగు వేస్తే ఇంకా మంచి ఫలితాలొస్తాయని ప్లంబర్ యూనియన్ బిజినెస్ నిర్వహకుడు, డేలీ ఫ్రెండ్ అయిన స్టీఫెన్ చెప్పడంతో ఆ సంప్రదాయం మొదలైంది.
మొదట ఉపయోగించిన రంగు నూనె ఆధారిత ప్రొడక్ట్, తర్వాత దీన్ని ఫుడ్ గ్రేడ్ పౌడర్‌గా మార్చారు. దీని ఫార్ములా సీక్రెట్‌గా ఉంది. ఇది చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉన్నా, దీని పొడి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఒక మోటారు బోటులోని వ్యక్తులు పొడి చల్లుతుంటే, మరొక దాంట్లో ఉన్నవాళ్లు నీటిని కదిలిస్తూ వెళ్తారు. అలా నది నిమిషాల్లో గ్రీన్‌గా మారిపోతుంది. ఈ రంగు విషపూరితం కాని మిశ్రమం అని పైపు కనెక్షన్లలో లీకేజీలను కనుక్కోవడానికి ప్లంబర్లు ఉపయోగించారని యూఎస్ ఎపీఎ గతంలోనే చెప్పింది. ఈ ఏడాది 130 ఆకుపచ్చని రంగుతో నిండిన స్ప్రేలను ఉపయోగించారు. ఇది కూడా పూర్తిగా విషరహితమైనదే. దీనివల్ల కొన్ని గంటలపాటు నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. స్ప్రే తాలుకా అవశేషాలు కొన్ని రోజుల పాటు నదిపై కనిపిస్తాయి.