- రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ ఒప్పందం
- సింగపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎంవోయూ
- సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు పెట్టేందుకు పలు కంపెనీలు రెడీ
- పరిశీలన కోసం ఈ ఏడాది చివర్లో రాష్ట్రానికి రాక
- ఎస్ఎస్ఐఏ ప్రతినిధులతో చర్చించిన మంత్రి శ్రీధర్‌బాబు
- రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తం: సింగపూర్ మంత్రి గ్రేస్
- మూసీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసేందుకు ఓకే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ. 3,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
సీఎం సమక్షంలో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్.. ఏఐ డేటా సెంటర్ కోసం ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఈ కంపెనీ నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలువనుంది.
గౌరవంగా ఉంది: ఎస్టీటీ సీఈవో
తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతల కారణంగానే దాదాపు రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు ఎస్టీటీ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ అన్నారు. మౌలిక సదుపాయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సాహకంగా ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందన్నారు. కాగా, ప్రపంచానికి హైదరాబాద్ డేటా హబ్‌గా మారుతుందని మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తున్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.
కాగా, ప్రస్తుతం ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్నది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నది. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని అంచనా.
సంపూర్ణ సహకారం అందిస్తం: సింగపూర్ మంత్రి
సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలకు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నగరాల, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతలను తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృద్ధి ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పని చేసేందుకు అంగీకరించారు. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను గుర్తించాలని నిర్ణయించారు. తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కోసం కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ కల్చరల్ ‘మీట్ అండ్ గ్రీట్’కు సీఎం
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యే జయవీర్ , హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిణ్‌రెడ్డి ఉన్నారు. సింగపూర్ గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడు గడప రమేశ్ బాబు, సొసైటీ కార్యవర్గంతో పాటు పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.
సెమీ కండక్టర్ ఇండస్ట్రీలు పెట్టేందుకు రెడీ
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్ సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ) ప్రతినిధులు ప్రకటించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎస్ఎస్ఐఏతో ప్రత్యేక రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ సంస్థలు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సెమీకండక్టర్ పరిశ్రమ స్థాపనకు అందుబాటులో ఉన్న అనుకూలమైన పరిస్థితులను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానానికి ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఈ ఏడాది చివర్లో సింగపూర్ నుంచి తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పరిశీలన జరుపుతారని తెలిపారు.
ఈ భాగస్వామ్యం కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు, ఆర్థికాభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంది. సెమీకండక్టర్ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనున్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుంది.