పైకప్పు నుంచి నీళ్లు లీక్‌‌‌‌..ఆగిన మ్యాచ్‌‌‌‌

పైకప్పు నుంచి నీళ్లు లీక్‌‌‌‌..ఆగిన మ్యాచ్‌‌‌‌
  • మలేసియా ఓపెన్‌‌‌‌లో ఇండియా షట్లర్ ప్రణయ్‌‌‌‌కు చేదు అనుభవం

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌ : ఇండియా సీనియర్ షట్లర్, హెచ్‌‌‌‌ఎస్ ప్రణయ్‌‌‌‌ సీజన్‌‌‌‌ తొలి టోర్నమెంట్ అయిన మలేసియా ఓపెన్ సూపర్‌‌‌‌‌‌‌‌1000 ఈవెంట్‌‌‌‌లో అనూహ్య పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం పైకప్పు నుంచి నీళ్లు లీకైన కారణంగా రెండుసార్లు అతని మ్యాచ్‌‌‌‌కు అంతరాయం కలిగింది. చివరకు ఆటను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలో నిలిచిన ప్రణయ్‌‌‌‌ మంగళవారం తొలి రౌండ్‌‌‌‌లో  బ్రియాన్ యాంగ్‌‌‌‌తో మూడో నంబర్ కోర్టులో తలపడ్డాడు.

21–12తో తొలి గేమ్ గెలిచి రెండో గేమ్‌‌‌‌లో 6–3తో ఉన్న దశలో స్టేడియం పైకప్పు నుంచి వర్షపు నీళ్లు కోర్టుపై పడటంతో ఆట ఆగింది. గంటతర్వాత తిరిగి కొనసాగించగా రెండో గేమ్‌‌‌‌లో యాంగ్ 11–9తో ఆధిక్యంలోకి వచ్చిన సమయంలో మళ్లీ నీళ్లు వచ్చాయి. దాంతో అధికారులు మ్యాచ్‌‌‌‌ను సస్పెండ్ చేసి బుధవారం 21–12, 11–9 స్కోరు నుంచి తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. ఇంతపెద్ద టోర్నమెంట్‌‌‌‌లో  స్టేడియం పైకప్పు నుంచి నీళ్లు కారడం చర్చనీయాంశమైంది. తొలుత తాను ఆడుతున్న కోర్టు ఎడమ భాగంలో నీటి చుక్కలు పడటాన్ని చూసిన ప్రణయ్ చైర్‌‌‌‌‌‌‌‌ అంపైర్‌‌‌‌‌‌‌‌కు తెలిపాడు.

దాంతో అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న రెండో నంబర్ కోర్టులో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. నిర్వాహకులు వైట్ టవల్స్‌‌‌‌తో కోర్టుపై నీళ్లను తుడిచే ప్రయత్నం చేయడం గమనార్హం.  మరోవైపు మెన్స్ సింగిల్స్‌‌‌‌ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ 14-–21, 7-–21తో చైనీస్ తైపీకి చెందిన చి యుజెన్ చేతిలో వరుస గేమ్స్‌‌‌‌లో ఓడి నిరాశ పరిచాడు.   విమెన్స్‌‌‌‌ డబుల్స్ తొలి రౌండ్‌‌‌‌లో ఆరో సీడ్  పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జోడీ 21–10, 21–10తో ఓర్నిచా–సుకిటా (థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు.