గ్రామీణ స్టేడియాల్లో.. ఆటలు ఆడేదెట్లా?

గ్రామీణ స్టేడియాల్లో.. ఆటలు ఆడేదెట్లా?
  • సౌలతులు లేక నిరుపయోగంగానే  క్రీడా ప్రాంగణాలు
  • గత ప్రభుత్వంలో స్టేడియాల పేరుతో లక్షల్లో ఖర్చు
  • బోర్డులు పాతి బిల్లులు నొక్కేసిన కాంట్రాక్టర్లు
  • కాంగ్రెస్​ సర్కార్​ చర్యలు తీసుకోవాలంటున్న క్రీడాభిమానులు

గద్వాల/శాంతినగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన స్టేడియాలు కనీస సౌలతులు లేక బోర్డులకే పరిమితమయ్యాయి. గ్రామీణ స్టేడియాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, సింగిల్ బాల్, డబుల్ బాల్  ఆటలు ఆడొచ్చని.. గ్రామాల్లోని క్రీడాకారుల నైపుణ్యం వెలుగులోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ, ఫీల్డ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. హడావుడిగా ఎన్నికల ముందు బోర్డులు పాతేసి డబ్బులు నొక్కేశారే తప్ప ఎక్కడ కూడా సౌలతులు కల్పించలేదు.

అరకొర నిధులు..

ప్రతి క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ఎకరం స్థలం తగ్గకుండా ఉండాలని ఆఫీసర్లకు అప్పటి సర్కార్  ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ ఆఫీసర్లు గ్రామానికి దగ్గరగా ఉన్న అసైన్డ్, గవర్నమెంట్  భూములను సంబంధిత గ్రామ పంచాయతీకి అప్పగించారు. సాగు చేసుకుంటున్న పొలాలను కూడా బలవంతంగా లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో స్టేడియానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తామని చెప్పి.. ఆ తరువాత అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు.

 కేటాయించిన ఆ కొద్ది నిధులను కాజేశారనే ఆరోపణలున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా, ప్రతి జీపీకి స్టేడియాన్ని మంజూరు చేశారు. స్థలం లేని చోట కూడా స్కూల్  గ్రౌండ్  ముందు తెలంగాణ క్రీడా స్టేడియం అంటూ బోర్డు పాతేసి ఒక్కో బోర్డుకు రూ.30 వేలు కాజేశారు. 255 జీపీల్లో 185 పంచాయతీలకు స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ బోర్డులు ఏర్పాటు చేయగా, మిగిలిన 70 చోట్ల ఎక్కడపడితే అక్కడ బోర్డులు పాతేసి డబ్బులు కాజేశారని అంటున్నారు.

క్రీడా సామగ్రి ఎక్కడ?

తెలంగాణ స్టేడియాల కోసం క్రీడా సామగ్రిని కూడా పంపిణీ చేశారు. జిల్లాలోని 200 గ్రామపంచాయతీలకు వాలీబాల్, ఖోఖో పోల్స్, సింగిల్  బాల్, డబుల్  బాల్ కు సంబంధించిన ఆట వస్తువులు అందించారు. ఇలా గ్రామపంచాయతీ ఫండ్స్​ నుంచి రూ.19,500 చొప్పున ఖర్చు చేశారు. కానీ, ఎక్కడ కూడా ఆ సామగ్రి క్రీడా ప్రాంగణాల్లో కనిపించడం లేదు. అవన్నీ అప్పటి లీడర్ల ఇండ్లల్లోనే ఉన్నాయని, తమకు ఇవ్వలేదని క్రీడాకారులు విమర్శిస్తున్నారు.

లక్షల్లో ఖర్చు చేసినా..

గ్రామాల్లో ప్రతి క్రీడా స్టేడియానికి రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చుపెట్టినట్లు రికార్డులు చెబుతున్నాయి. పంచాయతీ నుంచి కొంత ఎన్ఆర్ఈజీఎస్  నుంచి కొంత ఖర్చు చేసినట్లు చూపించారు. లక్షలు ఖర్చుపెట్టినా గ్రామాల్లో స్టేడియాల్లో కనీస సౌలతులు కనిపించడం లేదు. అప్పటి లీడర్లు ఈజీఎస్​ ద్వారా మొరం తవ్వి డబ్బులు దండుకొని బిల్లులు చేసుకున్నారే తప్ప స్టేడియాలకు ఒరిగిందేమీ లేదని అంటున్నారు. స్టేడియాలు అందుబాటులోకి రాకపోవడంతో డబ్బులు వృథా అయ్యాయి. గ్రామ శివార్లలో దూరంగా క్రీడా ప్రాంగణాలు ఉండడం, అక్కడ సరైన సౌలతులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉండగా, మందుబాబులకు అడ్డాగా మారిపోయాయి.

 బిల్లులు రాకపోవడంతోనే..

క్రీడా మైదానాలకు పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదు. ఎన్ఆర్ఈజీఎస్  కింద కొన్ని డబ్బులు చెల్లించారు. కొంత పంచాయతీల ద్వారా ఇచ్చారు. ఇంకా కొందరికి డబ్బులు రావాల్సి ఉంది. స్టేడియాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

 శ్యాంసుందర్, డీపీవో, గద్వాల