చనిపోయిందొకరు..సమాచారమొకరికి..

చనిపోయిందొకరు..సమాచారమొకరికి..


సిద్దిపేట, వెలుగు: కరోనా మృత దేహాలు తారుమారైన సంఘటన మరువక ముందే సిద్దిపేట గవర్నమెంట్​ హాస్పిటల్​ సిబ్బంది మరో నిర్వాకం బయటపడింది. కరోనాతో హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న  వ్యక్తి చనిపోయాడని సిబ్బంది ఇచ్చిన తప్పుడు సమాచారం ఒక  కుటుంబంలో కొంత సేపు అయోమయాన్ని సృష్టించింది. బాధితుల వివరాల ప్రకారం.. చేర్యాల మండలం వీరన్న పేట గ్రామానికి చెందిన  అరిగె బాలయ్య(75) అతని కొడుకు కన్నయ్య(40) లు కరోనా బారిన పడి నాలుగు రోజుల క్రితం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం హాస్పిటల్​నుంచి అరిగె బాలయ్య మృతి చెందాడని, మృత దేహాన్ని తీసుకెళ్లాలని సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. విషయం తెలియగానే గ్రామంలో అంత్య క్రియలకు ఏర్పాట్లు చేసి బాలయ్య బంధువులు సిద్దిపేట గవర్నమెంట్​ హాస్పిటల్​కు చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్​ను సైతం మాట్లాడుకున్నారు. మృతదేహాన్ని చూస్తామని చెప్పడంతో సిబ్బంది  కవర్ ను తొలగించగా అది బాలయ్యది కాదని గుర్తించారు. దీంతో బాలయ్య బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీసి అతని పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని డిమాండ్‌‌ ‌‌చేశారు. ఇదే సమయంలో హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బాలయ్య కొడుకు కన్నయ్య కు ఫోన్ చేసి తండ్రి పరిస్థితి వాకబు చేయగా బాగానే  ఉన్నాడని చెప్పారు. దీంతో ఆగ్రహించిన బంధువులు  బాలయ్యను చూపాలని పట్టుబట్టడంతో బంధువుల్లో ఇద్దరిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.  వారు వెళ్లే సరికి బాలయ్య తన బెడ్​పై టిఫిన్​ చేస్తుండడంతో ఊపిరి పీల్చుకోగా వైద్య సిబ్బంది మాత్రం తమ తప్పిదంపై సారీ చెప్పి చేతులు దులుపుకున్నారు. ఏదేమైనా 3 రోజుల వ్యవధిలో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో రెండు పొరపాట్లు బయట పడగా తెలియనివి ఇంకా ఎన్ని ఉన్నాయోనని వారు వాపోయారు.