జగిత్యాల ఎంసీహెచ్‌‌‌‌లో శిశువులు తారుమారు

జగిత్యాల ఎంసీహెచ్‌‌‌‌లో శిశువులు తారుమారు
  • ట్యాగ్‌‌‌‌లు చూసుకోకుండా శిశువును అప్పగించిన సిబ్బంది
  • ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం వేరే హాస్పిటల్‌‌‌‌కు వెళ్లిన తర్వాత గుర్తించిన స్టాఫ్‌‌‌‌

జగిత్యాల, వెలుగు : హాస్పిటల్‌‌‌‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువులు తారుమారు అయ్యారు. పొరపాటును గుర్తించిన సిబ్బంది చివరకు ఎవరి బిడ్డను వారికి అప్పగించారు. ఈ ఘటన జగిత్యాల ఎంసీహెచ్‌‌‌‌లో సోమవారం జరిగింది. బీర్పూర్‌‌‌‌ మండలం మంగెళ గ్రామానికి చెందిన ప్రసన్న నాలుగు రోజుల కింద పురిటినొప్పులతో జగిత్యాల ఎంసీహెచ్‌‌‌‌లో చేరింది. ఆమెకు సోమవారం డెలివరీ చేయగా మగశిశువు పుట్టాడు. ప్రసన్నతో పాటు పద్మ అనే మరో మహిళ సోమవారమే డెలివరీ కావడంతో ఆమెకు కూడా మగ బిడ్డ పుట్టాడు. ప్రసన్నకు పుట్టిన బిడ్డకు మరో హాస్పిటల్‌‌‌‌లో వైద్య పరీక్షలు చేయించాలని సిబ్బంది సూచించడంతో ఆమె భర్త సతీశ్‌‌‌‌ శిశువును తీసుకొని హాస్పిటల్‌‌‌‌కు వెళ్లాడు. 

కొద్ది సేపటి తర్వాత సతీశ్‌‌‌‌ తీసుకెళ్లింది ప్రసన్న కొడుకు కాదని.. పద్మకు పుట్టిన బిడ్డ అని గుర్తించిన ఎంసీహెచ్‌‌‌‌ సిబ్బంది వెంటనే హాస్పిటల్‌‌‌‌కు రావాలని సతీశ్‌‌‌‌కు సమాచారమిచ్చారు. హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన శిశువుకు ఉన్న ట్యాగ్‌‌‌‌పై తల్లి పేరు పద్మ అని ఉండడంతో శిశువులు తారుమారయ్యారని గుర్తించి, ఎవరి బిడ్డను వారికి అప్పగించారు. ట్యాగ్‌‌‌‌ చూడకుండా, నిర్లక్ష్యంగా శిశువును అప్పగించిన వైద్య సిబ్బందిపై సతీశ్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువును ఇచ్చే టైంలో డ్రెస్‌‌‌‌, టవల్‌‌‌‌ తమది కాదని చెబుతున్నా వినిపించుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ఆర్ఎంవో నవీన్‌‌‌‌ను సంప్రదించగా శిశువులు తారుమారైన విషయం వాస్తవమేనన్నారు. పిల్లల చేతికి ఉన్న ట్యాగ్‌‌‌‌ చూసుకోకుండా హాస్పిటల్‌‌‌‌ సిబ్బంది బంధువులకు అప్పగించారని, ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌‌‌‌ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు.