ఖైరతాబాద్, వెలుగు: ‘‘ఉద్యోగం ఇస్తే కేసీఆర్ ఫొటో పెట్టుకుంటాం. లేదంటే ప్రాణాలు తీసుకుంటాం. అన్ని అర్హతలు ఉన్న మమ్మల్ని పక్కన పెట్టడం అన్యాయం. ఎందుకు పక్కన పెట్టారో తెలియడం లేదు. కేసీఆర్ సార్.. మా పాలిట మీరే దేవుడు, కాస్త కనికరించండి. ఇంట్లో పిల్లలు ఉన్నరు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది”ఇది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఆవేదన. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం 2017లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన తమకు ఉద్యోగాలివ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉద్యోగ అభ్యర్థి రవీందర్ మీడియాతో మాట్లాడారు. 2017లో 3,311 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా, 2018లో ఎగ్జామ్ పెట్టారని, పరీక్ష ఫలితాలు 2020 నవంబర్‌లో రిలీజ్ చేశారని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగాయని చెప్పారు. నోటిఫికేషన్ ప్రకారం 3,311 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా, 2,418 పోస్టులు మాత్రమే నింపారని, మిగతా 893 పోస్టులు బ్యాక్‌లాగ్‌లో పెట్టారన్నారు. దీని వల్ల అర్హత కలిగిన తాము అన్యాయానికి గురవుతున్నామని చెప్పారు. మిగిలిన పోస్టులను భర్తీ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వివేక్, లక్ష్మి, లలిత, సంధ్య పాల్గొన్నారు.