వేధిస్తున్న స్టాఫ్ కొరత.. టీ హబ్‌లో టెస్టులు అంతంతే..!

వేధిస్తున్న స్టాఫ్ కొరత.. టీ హబ్‌లో టెస్టులు అంతంతే..!
  • రియేజెంట్స్ లేక తగ్గిన టెస్టులు
  • డీఎంఈ, జిల్లా వైద్యారోగ్య శాఖల నిర్లక్ష్యం
  • వేధిస్తున్న స్టాఫ్ కొరత 
  • పట్టించుకోని ఉన్నతాధికారులు 

జనగామ, వెలుగు: జనగామ తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లో టెస్టులు తగ్గిపోయాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ హబ్ కొన్ని నెలలుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ సెంటర్ పై డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్​ ఎడ్యుకేషన్​, జిల్లా వైద్యారోగ్య శాఖల ఆజమాయిషీ ఉండగా, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా టెస్టుల నిర్వాహణకు అవసరమైన ఇండెంట్ (రియేజెంట్స్) కూడా రాక పరిస్థితి గాడి తప్పింది. ఇదే అదనుగా ప్రైవేటు ల్యాబ్ సెంటర్ల నిర్వాహకులు రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.

రియేజెంట్స్ కోసం అవస్థలు..

ఇండెంట్ (రియేజెంట్స్) కోసం టీ హబ్ నిర్వాహకులు ఎదురు చూడాల్సి వస్తోంది. జిల్లా హాస్పిటల్​ సూపరింటెండెంట్​గోపాల్ రావు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉండగా, డీఎంహెచ్​వో మల్లిఖార్జున్ రావు పది రోజుల క్రితమే ఇక్కడ విధుల్లో చేరారు. గతంలో డీఎంహెచ్​ఓగా పనిచేసిన వారు పెద్దగా పట్టించుకోలేదు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం టీ హబ్​కు శాపంగా మారింది. టెస్టులకు అవసరమైన రియేజెంట్స్ (టెస్ట్ ట్యూబ్లు, కెమికల్స్ తదితరాలు) ల ఇండెంట్ సకాలంలో అందడం లేదు. వీటికి కావాల్సిన నిధుల వెచ్చింపునకు ఇరు శాఖల అధికారులు ఆసక్తి చేపడం లేదు. దీంతో ప్రతీ మూన్నెళ్లకు ఒకసారి రావాల్సిన రియేజెంట్స్​కు కొరత ఏర్పడింది. 

ఫలితంగా రోజురోజుకు పరిస్థితి అధ్వాన్నంగా మారి టెస్టుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే సీబీపీ, రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్​టీ టెస్ట్​లు నిలిచిపోయాయి. అధికారులు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే మరిన్ని టెస్టులు ఆగిపోయే పరిస్థితి ఉంది. సీహెచ్​సీల నుంచి ప్రతి రోజు 15, పీహెచ్​సీల నుంచి 10 రక్త నమూనాలు టీ హబ్​కు పంపించాలని టార్గెట్లు ఉండగా, సీహెచ్​సీల డాక్టర్లు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. 

పని చేయని జనరేటర్..

టీ హబ్​లో టెస్టుల రిజల్ట్స్ సరిగా రావాలంటే మిషనరీ ఉన్న ల్యాబ్ గదులు సరైన టెంపరేచర్ లో ఉండాలి. అందుకోసం ఇక్కడ ఎయిర్ కండిషనర్లు ఉన్నా, కొంత కాలంగా మెయింటెనెన్స్ లేక అవి మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎలాగోలా నెట్టుకొస్తున్నామని, వేసవిలో మిషనరీ పనిచేయడం కష్టమని స్టాఫ్ చెబుతున్నారు. జనరేటర్ మూలకు పడినా పట్టించుకున్న వారు లేరు. 

వేధిస్తున్న స్టాఫ్ కొరత..​ 

టీ హబ్​లో 134 రకాల టెస్టులు చేస్తారనేది మాటలకే పరిమితమైంది. వీటిలో 40కి పైగా టెస్టులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. జిల్లా మొత్తంగా సీహెచ్​సీలు, పీహెచ్​సీలు, జిల్లా హాస్పిటళ్ల నుంచి నిత్యం 500లకు పైగా శాంపిల్స్ వస్తుంటాయి. వీటిని పరీక్షించేందుకు సరిపడా స్టాఫ్​ లేదు. కనీసం 12 మంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆరుగురితో నెట్టుకొస్తున్నారు. కీలకంగా ఉండే డాక్టర్లు ఎవరూ లేరు. పాథలజిస్ట్, బయో కెమిస్ట్, మైక్రో బయాలజిస్ట్, రేడియాలజిస్ట్​లు లేరు. దీంతో టెక్నీషియన్లే టెస్టులు చేసి రిపోర్లు ఇస్తున్నారు. డీఎంఈ నుంచి వీరిని అందుబాటులో ఉంచాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.